ఒకే రోజు దంపతుల ఉద్యోగ విరమణ
అశ్వారావుపేటరూరల్: దంపతులైన వారిద్దరు వేర్వేరు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు కాగా ఒకేరోజు (శనివారం) ఉద్యోగ విరమణ చేయనున్నారు. దంపతులిద్దరు ఉద్యోగాలు చేయడం ప్రత్యేకత కాకున్నా ఒకే రోజు ఉద్యోగ విరమణ చేయనుండడం విశేషం. అశ్వారావుపేట మండలం పాత రెడ్డిగూడెం యూపీఎస్ హెచ్‌ఎం గొల్లపల్లి లక్ష్మీనర్సుగౌడ్, ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రేపాకగొమ్ము ప్రాథమిక పాఠశాలలో ఆయన భార్య రామతులసి హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు. వీరు శనివారం ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యాన శుక్రవారం పాతరెడ్డిగూడెం పాఠశాలలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులంతా సన్మానించారు. అలాగే, లక్ష్మీనర్సుగౌడ్‌కు రాష్ట్ర విద్యాశాఖ నుంచి అందిన ప్రశంసాపత్రాన్ని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, డీఈఓ నాగలక్ష్మి అందజేశారు. హెచ్‌ఎం దంపతులను కలెక్టర్, డీఈఓతోపాటు ఎంఈఓ పి.ప్రసాద్‌రావు అభినందించారు.


