సారపాక వాసికి డాక్టరేట్
బూర్గంపాడు: మండలంలోని సారపాక గాంధీనగర్‌కు చెందిన ఆదూరి కావ్యకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ లభించింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఆమె నల్లమల అడవుల్లో చెద పురుగులపై సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథానికి డాక్టరేట్ దక్కింది. ఈ సందర్భంగా కావ్యను స్థానికులు అభినందించారు.
విద్యుత్ ఉద్యోగుల బదిలీలకు బ్రేక్
ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ నిలిచిపోయింది. ఉద్యోగుల, కార్మిక సంఘాల అభ్యర్ధనతో పాటు మున్సిపల్ ఎన్నికల నేపథ్యాన ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని విద్యుత్ అధికారులకు మౌఖిక ఆదేశాలు చేశాయి. ప్రస్తుత స్థానంలో జనవరి 1నాటికి రెండేళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగుల్లో 50 శాతం మందిని బదిలీ చేసేలా ఈనెల 21న షెడ్యూల్ విడుదల చేశారు. ఈమేరకు అర్హుల జాబితా విడుదల చేయగా పలువురు దరఖాస్తు చేసుకోవడంతో 31వ తేదీన ఉత్తర్వులు విడుదల చేయాల్సి ఉంది. అయితే, విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేయడం, కాలపరిమితిని రెండేళ్లకు తగ్గించడాన్ని నిరసిస్తూ ఉద్యోగ, కార్మిక సంఘాలు ఆందోళనకు దిగడం, మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతుండడంతో ప్రక్రియను నిలిపివేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి.
పేకాట స్థావరంపై దాడి
చండ్రుగొండ: మండలంలోని బెండాలపాడు గ్రామ శివారు పత్తి చేనులో పేకాట శిబిరంపై గురువారం రాత్రి పోలీసులు దాడి చేశారు. ఎస్‌ఐ శివరామకృష్ణ శుక్రవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బెండాలపాడు గ్రామానికి చెందిన ఏడుగురు గ్రామ శివారులోని పత్తి చేనులో పేకాట అడుతుండగా దాడి చేసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.10,260 నగదు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ వెల్లడించారు.
చెట్టును ఢీకొన్న ఆటో
గుండాల: ఖమ్మం నుంచి మేడారం వెళ్తున్న ఆటో చెట్టును ఢీకొట్టగా నలుగురికి గాయాలైన ఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని సత్తుపల్లికి చెందిన ఓ ఆటో భక్తులతో ఇల్లెందు నుంచి వయా గుండాల మీదుగా మేడారం వెళ్తుండగా తూరుబాక సమీపంలో ఓ చెట్టును ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ శివశంకర్, విజయలక్ష్మి, నాగు, కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు.
ఐటీసీలో చోరీకి
యత్నించిన ముగ్గురిపై కేసు
బూర్గంపాడు: ఐటీసీ పీఎస్‌పీడీలో కాపర్ వైర్ చోరీకి యత్నించిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ ప్రసాద్ కథనం ప్రకారం.. సారపాక గాంధీనగర్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు శుక్రవారం తెల్లవారుజామున ఐటీసీ ప్రాజెక్ట్ గేట్ దూకి కాపర్ వైర్ చోరీకి యత్నిస్తున్న క్రమంలో సెక్యూరిటీ అధికారులు పట్టుకున్నారు. ఐటీసీ సెక్యూరిటీ అధికారుల ఫిర్యాదు మేరకు చల్లా శివ, చల్లా లక్ష్మణ్, నాగ గణేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
సారపాక వాసికి డాక్టరేట్


