కుక్కలకు చర్యవ్యాధులు
● వీధి కుక్కలకు విస్తరిస్తున్న స్కిన్ ఎలర్జీ ● 90 శాతం కుక్కలకు సోకిన రుగ్మతలు ● భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు
బూర్గంపాడు: జిల్లాలోని పలు ప్రాంతాలలో వీధి కుక్కలు స్కిన్ ఎలర్జీతో అనారోగ్యానికి గురయ్యాయి. కుక్కల ఒంటిపై వెంట్రుకలు రాలిపోయి, పుండ్లు పడి, అక్కడక్కడా చర్మం ఊడిపోతూ చూసేందుకు కూడా ఇబ్బందికరంగా మారాయి. ఈ స్కిన్ ఎలర్జీ ఓ కుక్క నుంచి మరో కుక్కకు తొందరగా వ్యాప్తి చెందుతోంది. కొన్ని కుక్కలకు స్కిన్ ఎలర్జీతో పాటుగా నోటి నుంచి చొంగకారుతోంది. వీధుల్లో కుక్కలు సంచరిస్తున్నప్పుడు వాటి పక్క నుంచి వెళ్లాలంటే కూడా స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. వీధి కుక్కలకు ఉన్న స్కిన్ ఎలర్జీని చూసి పలువురు పెంపుడు కుక్కలను బయటకు వదలటం లేదు. పెంపుడు కుక్కలకు పశువైద్యులతో ముందస్తుగానే వైద్యం చేయిస్తున్నారు.
చలి తీవ్రత పెరగడంతోనే..
ఈ ఏడాది చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో వీధి కుక్కలకు ిస్కిన్ ఎలర్జీ తొందరగా వ్యాప్తి చెందుతోంది. నవంబర్ నుంచి కుక్కలకు స్కిన్ ఎలర్జీ సోకింది. రానురాను ఇది మరింత తీవ్రంగా మారింది. స్కిన్ ఎలర్జీ కారణంగా కుక్కలు సరిగా ఆహారం తీసుకోవటం లేదు. ఎప్పుడు చూసిన కాళ్లతో, నోటితో ఎలర్జీ ఉన్న భాగాల్లో గోకుతూ కనిపిస్తున్నాయి. దురదను తట్టుకోలేక కాలి గోళ్లతో గోకుతుండటంతో చర్మం ఊడి రక్తం కారుతోంది. ప్రస్తుతం ఓ వైరస్ మాదిరిగా కుక్కలకు స్కిన్ ఎలర్జీ విస్తృతంగా వ్యాపిస్తోంది. గ్రామాలతో పాటుగా పట్టణ ప్రాంతాల్లోని వీధి కుక్కలకు కూడా ఈ వ్యాధి సోకింది. 90 శాతం వీధి కుక్కలు స్కిన్ ఎలర్జీతో చూసేందుకు అసహ్యంగా కనిపిస్తున్నాయి. వీధి కుక్క పిల్లలకు కూడా స్కిన్ ఎలర్జీ సోకటంతో అవికూడా ఇబ్బందులు పడుతున్నాయి. గ్రామాలలో పిల్లలు, మహిళలు బయటకు వచ్చినప్పుడు స్కిన్ ఎలర్జీతో ఉన్న కుక్కలు కనిపిస్తే భయపడుతున్నారు. చేతిలో కర్ర లేకుంటే ఎక్కడ మీద పడతాయోనని ఆందోళన చెందుతున్నారు.


