ముందైతే వేసేద్దాం!
హస్తంలో మిత్రభేదం..
ప్రధాన పార్టీల మధ్య కుదరని సయోధ్య సీపీఐ – కాంగ్రెస్ పొత్తుపై చర్చోపచర్చలు ఒంటరి పోరుకై నా సై అంటున్న బీఆర్‌ఎస్, బీజేపీ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగియనుంది. అయితే పొత్తుల విషయంలో ప్రధాన పార్టీల మధ్య గురువారం పొద్దు పోయే వరకూ స్పష్టత రాలేదు. దీంతో ముందు జాగ్రత్తగా ఆశావహులు భారీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నామినేషన్ వేస్తే.. ఉపసంహరణ గడువు వరకు పోటీలో నిలిచే అవకాశం ఉండడంతో రాజకీయ సమీకరణలతో సంబంధం లేకుండా పుర పోరుకు ఆసక్తి ఉన్న వారు ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో కొత్తగూడెం కార్పొరేషన్, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో గురువారం భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. మరోవైపు జిల్లాలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం, బీజేపీ, సీపీఐ(ఎంఎల్) నాయకులు.. ఆయా మున్సిపాలిటీల వారీగా ఒంటరిగా బరిలోకి దిగితే మంచిదా, ఏ పార్టీతో అయినా కలిసి సాగితే తమకు లాభిస్తుందా అనే అంశంపై వేసుకునే అంచనాలు చివరి దశకు చేరుకున్నాయి.
సీపీఐ మిత్రలాభం..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేశాయి. దీంతో కొత్తగూడెం స్థానం నుంచి సీపీఐ పోటీ చేసి విజయం సాధించింది. ఇప్పుడు ఇదే కొత్తగూడెం కార్పొరేషన్ విషయంలో ఇరు పార్టీల మధ్య సఖ్యత కుదరడం లేదు. కార్మికులు ఎక్కువగా ఉండే కార్పొరేషన్‌లో తాము సొంతంగా పోటీ చేసినా మెజార్టీ డివిజన్లు దక్కించుకుంటామనే ధీమాను సీపీఐ నాయకత్వం వ్యక్తం చేస్తోంది. అందుకు తగ్గట్టే ఇరు పార్టీల మధ్య ఉన్న పొత్తును దృష్టిలో ఉంచుకుని కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో తమకు 25కు తగ్గకుండా సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. కొత్తగూడెంలో పొత్తుపై స్పష్టత వస్తే, ఆ తర్వాత ఇల్లెందు మున్సిపాలిటీలో 24 వార్డుల్లో 8 చోట్ల, అశ్వారావుపేటలో 22 వార్డుల్లో మూడు చోట్ల పోటీ చేసేందుకు ఆ పార్టీ ప్రణాళిక సిద్ధం చేసుకుంది.
అసంతృప్తులపై దృష్టి..
గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ హవా నడిచింది. ఇల్లెందు, కొత్తగూడెంలో ఆ పార్టీ పాగా వేసింది. అయితే ఈ రెండు స్థానాల్లోనూ కొలువుదీరిన పాలకవర్గాలు చివరి ఏడాది తీవ్ర ఒడిదుడులకు లోనయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరోసారి పురపాలికల్లో బీఆర్‌ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితే ఎదురైంది. అయినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత, గతంలో తాము చేసిన మంచి పనులు తమకు లాభిస్తాయనే అంచనాతో ఆ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. అధికార కాంగ్రెస్‌తో పొత్తు కుదరని పక్షంలో స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సీపీఐ, సీపీఎం తదితర పార్టీలతో కలిసి పోటీ చేసే ప్రతిపాదనలపై నామినేషన్ల చివరి రోజు వరకు ఊగిసలాట కొనసాగుతూ వస్తోంది. దీంతో తమ పార్టీని నమ్ముకున్న కేడర్‌తో పాటు ఇతర పార్టీల్లో టికెట్లు దక్కక అసంతృప్తితో ఉన్న బలమైన నేతలను ఆకర్షించే పనిలో బీఆర్‌ఎస్ ఉంది. ఇక జిల్లాపై పట్టు కోసం భారతీయ జనతా పార్టీ సైతం ఈసారి గట్టిగా ప్రయత్నించాలనే లక్ష్యంతో ఉంది. గతంలో కనీసం ఇక్కడ ఒక్క వార్డుమెంబర్ కూడా ఆ పార్టీకి లేరు. రెండు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో బలమున్న చోట ఎన్నికల్లో నిలబడాలని, పురపాలనలో ప్రాతినిధ్యం దక్కించుకోవాలని ఆ పార్టీ పావులు కదుపుతోంది.
కొత్తగూడెం ఎమ్మెల్యే స్థానం ఇప్పటికే మిత్రపక్షమైన సీపీఐకి ఇచ్చామని, కార్పొరేషన్ విషయంలో రాజీ లేదనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ వినిపిస్తోంది. అయితే, రాష్ట్ర స్థాయిలో ఇరుపార్టీల మధ్య గల స్నేహాన్ని దృష్టిలో ఉంచుకుని చివరి నిమిషంలో కాంగ్రెస్ కొంత మెత్తబడినట్టు సమాచారం. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 60 స్థానాల్లో కచ్చితంగా 35 చోట్ల పోటీ చేయాలనే నిర్ణయానికి కాంగ్రెస్ వచ్చింది. ఈ విషయంలో ఎలాంటి రాజీకి అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. తమతో కలిసి వచ్చే ఇతర రాజకీయ పక్షాలకు 25 డివిజన్లు కేటాయించే అవకాశముంది. ఇందులో సీపీఐకి 20కి పైగా స్థానాలు కేటాయించవచ్చనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రతిపాదనపై ఈ సారైనా ఇరు పార్టీల మధ్య సానుకూల ఒప్పందం జరుగుతుందా లేదా అనేది శుక్రవారంతో తేలిపోనుంది.
పొత్తులతో సంబంధం లేకుండా నామినేషన్లు వేస్తున్న ఆశావహులు


