మ్యూజియానికి కొత్త సొబగులు..
● అభివృద్ధికి కేంద్రం నుంచి రూ.కోటి మంజూరు ● మినీ ఆడిటోరియం పనులకు ప్రణాళిక ● పర్యాటకులతో ఇప్పటికే ఆదరణ
భద్రాచలం: భద్రాచలంలో గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలు, వారి ఆచార, వ్యవహారాలు, కుల వృత్తులు, ఆహారపు అలవాట్లు, జీవనశైలిని ప్రపంచానికి తెలిపేలా ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియానికి మంచి రోజులు వచ్చాయి. ఇప్పటికే లక్షలాది పర్యాటకులను ఆహ్లాదపర్చిన ఈ మ్యూజియం ఇక నూతన సొబగులను అద్దుకోనుంది. అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన రూ.కోటి నిధులను మంజూరు చేసినట్లు కేంద్ర ప్రతినిధులు ఇటీవల హైదరాబాద్‌లో ప్రకటించారు. ఈ నిధులు మరో కొద్ది రోజుల్లో జమ కాగానే మ్యూజియం అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.
మినీ ఆడిటోరియం.. ప్రత్యేక సౌకర్యాలు..
గిరిజన మ్యూజియంపై ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధ పెట్టి దేశవ్యాప్తంగా గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలకు వన్నె తెచ్చిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్ ఇతర అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. రూ.కోటి నిధులతో చేపట్టాల్సిన పనులకు సంబంధించి పలుమార్లు యూనిట్ అధికారులు, గిరిజన పెద్దలతో చర్చించారు. ప్రణాళికకు తుది రూపు తీసుకురానున్నారు. ప్రధానంగా గిరిజన ఆట, పాటలు, ప్రదర్శనలు, ఇతర గిరిజన కార్యక్రమాలను వీక్షించేందుకు మినీ ఆడిటోరియం ప్రతిపాదన ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. సుమారు 200 నుంచి 300 వరకు కూర్చుని వీక్షించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మేడారంలో ఇటీవల ఏర్పాటు చేసిన గిరిజన విగ్రహాల మాదిరిగా ఈ గిరిజన మ్యూజియం ప్రాంగణంలో పలుచోట్ల నిర్మించనున్నారు. వీటితోపాటు ప్రస్తుతం చిన్నారులకు ఉన్న ఆటలకు తోడుగా మరో ప్లే గ్రౌండ్, పార్కింగ్, వాటర్ ఫౌంటెన్, మిరుమిట్లు గొలిపే అత్యాధునిక లైటింగ్, నిరంతరం విద్యుత్ సరఫరా కోసం జనరేటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఉన్న వెదురు ఇళ్లకు అదనంగా మరికొన్ని వెదురు ఇళ్లను గిరిజన సంప్రదాయబద్ధంగా ఉండేలా నిర్మించనున్నారు. ఈ మ్యూజియాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు, మ్యూజియం ముచ్చట్లు, ఆవశ్యకత తెలిసేలా ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించనున్నారు.
ఆదరణ పెరిగే అవకాశం
గిరిజన మ్యూజియానికి ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. లక్షలాది మంది పర్యాటకులతోపాటు సెలవు రోజుల్లో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. అధికారులు మరింత శ్రద్ధ పెడితే ఈ పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. దేవస్థానం దర్శనానికి వచ్చే భక్తులు, పర్యాటకులకు ప్రధానంగా ఐటీడీఏలోని ట్రైబల్ మ్యూజియానికి వచ్చేందుకు రవాణా వ్యవస్థ పెద్ద సమస్యగా మారుతోంది. ఐటీడీఏ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ద్వారా వాహనాలను నిరుద్యోగ యువతకు కేటాయించి, ఆ వాహనాలను నేరుగా మ్యూజియానికి తీసుకువచ్చే విధంగా ఏర్పాటు చేస్తే ఈ సమస్యను అధిగమించవచ్చని అంటున్నారు. దేవస్థానం ప్రాంగణం, సీఆర్‌ఓ కార్యాలయం, బ్రిడ్జి సెంటర్, బస్టాండ్‌ల ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్‌లను ఏర్పాటు చేయాలి. ఇక్కడే మ్యూజియం టికెట్‌తో పాటుగా ఈ రవాణా ఖర్చులను అనుసంధానం చేయటం ద్వారా మ్యూజియానికి మరింత ఆదరణ లభించే అవకాశం ఉంది. వీటిపై ఐటీడీఏ పీఓ రాహుల్, ఇతర అధికారులు శ్రద్ధ వహిస్తే వారి కృషికి మరింత ప్రాచుర్యం రానుంది.
అనతికాలంలోనే భద్రాచలం వచ్చే పర్యాటకులు, భక్తులు, స్థానికుల మన్ననలను గిరిజన మ్యూజియం చూరగొన్నది. దీంతో ప్రజాప్రతినిధుల సిఫార్సులు, అధికారుల నివేదికలతో గత ఏడాది జూన్‌లో గిరిజన మ్యూజియం అభివృద్ధికి న్యూఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ (మోట) రూ.కోటి నజరాన ప్రకటించింది. కాగా, ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ సెమినార్‌లో ఈ నిధులను మంజూరు చేస్తున్నట్లు మోట ప్రతినిధులు ప్రకటించారు. ఇవి సింగిల్ నోడల్ బడ్జెట్‌కు జమ కాగానే అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు.


