సీఎస్సార్ నిధులతో మౌలిక వసతులు
బూర్గంపాడు: నవభారత్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సీఎస్సార్ నిధులతో గ్రామాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు సహకారం అందిస్తున్నామని ఆ కంపెనీ మానవ వనరుల విభాగం జనరల్ మేనేజర్ సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. బూర్గంపాడులోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్సియల్ బాలికల పాఠశాలలో నవ లిమిటెడ్ సహకారంతో నిర్మించిన వాష్‌రూమ్‌లను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు సామాజిక బాధ్యతగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికవసతుల కల్పనకు చేయూతనందిస్తున్నామని చెప్పారు. పలు పాఠశాలల్లో డైనింగ్ హాళ్లు, వంట గదులు, ప్రహరీలు, ప్రయోగశాలలు నిర్మించామని వివరించారు. కంప్యూటర్ విద్యనందించేందుకు ఉపాధ్యాయులను నియమించామని, ల్యాబ్‌లకు అవసరమైన సామగ్రి కూడా అందించామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ కేఆర్‌కేవీ ప్రసాద్, హెచ్‌ఎం గీతాజ్యోతి, నవ లిమిటెడ్ లైసెన్ ఆఫీసర్ ప్రసాద్, కరుణాకర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
సీఎస్సార్ పనులకు గుర్తింపుగా అవార్డు..
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని పట్టణాలు, గిరిజన గ్రామాల్లో సింగరేణి సీఎస్సార్ నిధులతో చేపట్టిన పనులకు గాను ‘బీకన్ ఆఫ్ హోప్’ అవార్డు పొందిన అధికారులు గురువారం వివరాలు వెల్లడించారు. ఇటీవల భద్రాచలంలో జరిగిన సీఎస్సార్ సమ్మిట్‌లో కలెక్టర్ జితేష్ వి. పాటిల్ చేతుల మీదుగా తమ సంస్థ జనరల్ మేనేజర్(వెల్ఫేర్ అండ్ సీఎస్సార్) కిరణ్‌కుమార్, సీఎస్సార్ అధికారి గట్టు స్వామి అవార్డు అందుకున్నారని తెలిపారు. సింగరేణి సంస్థ గత ఐదేళ్ల కాలంలో రూ.15 కోట్ల సీఎస్సార్ నిధులతో పాఠశాలల భవనాలు, రోడ్లు, డ్రైనేజీలు వంటి ప్రజోపయోగమైన అనేక పనులను చేపట్టిందని వివరించారు. కాగా, తమ సంస్థ అన్ని జిల్లాల్లోనూ కోట్ల రూపాయలు వెచ్చించి మౌలిక సదుపాయాలతో పాటు విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కృషి చేస్తోందని సింగరేణి అధికారులు వెల్లడించారు.


