ఊపందుకున్న నామినేషన్లు..
రెండో రోజు దాఖలు చేసిన 319 మంది
అభ్యర్థుల కోసం హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు
నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ
సాక్షిప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్‌తో పాటు అశ్వారావుపేట, ఇల్లెందు మున్సిపాలిటీల పరిధిలో రెండో రోజు గురువారం 319 మంది అభ్యర్థులు నామినేషన్లు భారీగా దాఖలు చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని కొత్తగూడెంలో 78, పాల్వంచలో 89, సుజాతనగర్‌లో ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. అశ్వారావుపేట మున్సిపాలిటీకి సంబంధించి రెండో రోజు 58 నామినేషన్లు దాఖలు కాగా, ఇందులో కాంగ్రెస్ అభ్యర్థులు 18 మంది, బీఆర్‌ఎస్ 21, బీజేపీ 4, సీపీఎం 2తో పాటు ఇతర అభ్యర్థులు 13 మంది నామినేషన్లు వేశారు. ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని 8 కేంద్రాల్లో 88 మంది నామినషన్లు సమర్పించారు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థులు 28 మంది, బీఆర్‌ఎస్‌కు చెందిన 34 మందితో పాటు ఇతర పార్టీలకు చెందిన 26 మంది నామినేషన్లు వేశారు. వీరిలో కొందరు పార్టీల బీ ఫామ్‌లతో సంబంధం లేకుండానే నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. ముందుగా నామినేషన్‌లు సమర్పించినా.. ఆ తర్వాత పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు అవసరమైతే ఉపసంహరించుకోవచ్చనే ఆలోచనతో దాఖలు చేసినట్టు సమాచారం.
నేడే ఆఖరు..
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ స్వీకరణ ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. మూడు రోజులు అవకాశం ఇవ్వడంతో తొలి రెండు రోజులు పొత్తుల్లో స్పష్టత లేకపోవడం, ఇతర కారణాలతో చాలా మంది వేచిచూశారు. ఇక చివరిరోజు మాత్రం పార్టీలు ప్రకటించిన అభ్యర్థులే కాక ఆశావహులంతా నామినేషన్లు వేయనున్నారు. పార్టీల నుంచి జాబితాలు రావడం, సీట్ల సర్దుబాటు చివరి దశకు చేరడంతో నాయకుల సూచనల మేరకు అభ్యర్థులు నామినేషన్ల దాఖలకు సిద్ధమవుతున్నారు. ఫలితంగా చివరిరోజు నామినేషన్ కేంద్రాల వద్ద రద్దీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది.


