‘భారజలం’.. దేశానికే తలమానికం
అంతర్జాతీయ ప్రమాణాలతో..
మణుగూరు కర్మాగారానికి ప్రత్యేక గుర్తింపు ఆక్సిజన్ –18 ఉత్పత్తితో నిలిచిన దిగుమతి భారం త్వరలో 100 కేజీల ప్లాంట్ నిర్మాణం రేపు శంకుస్థాపన చేయనున్న ఏఈసీ చైర్మన్
అశ్వాపురం: భారజలం ఉత్పత్తి, ఎగుమతుల్లో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు గల అశ్వాపురం మండలంలోని మణుగూరు భారజల కర్మాగారం దేశానికే తలమానికంగా నిలిచింది. ఈ కర్మాగారంలో ఆక్సిజన్ – 18 ఎన్‌రిచ్‌డ్ వాటర్ ఉత్పత్తితో మరింతగా ప్రాధాన్యత పొందనుంది.
100 కేజీల ఉత్పత్తికి చర్యలు..
మణుగూరు భారజల కర్మాగారంలో ప్రస్తుతం 10 కేజీల ఆక్సిజన్ –18 ఉత్పత్తి అవుతుండగా, అదనంగా ఏడాదికి 100 కేజీల ఆక్సిజన్ ఎన్‌రిచ్‌డ్ వాటర్ ఉత్పత్తి చేసేందుకు నూతన ప్లాంట్ నిర్మిస్తున్నారు. ఇందుకు రూ.160 కోట్లు ఖర్చు చేయనుండగా ఈనెల 31న భారత అణుశక్తి విభాగం(డీఏఈ) కార్యదర్శి, ఏఈసీ చైర్మన్ డాక్టర్ అజిత్‌కుమార్ మహంతి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
వైద్యరంగంలో కీలకం..
ఆక్సిజన్–18 ఎన్‌రిచ్‌డ్ వాటర్‌కు వైద్య రంగంలో ఎంతో ప్రత్యేకత ఉంది. కేన్సర్ రోగులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ(పీఈటీ) స్కానింగ్ ద్వారా దీన్ని కేన్సర్ బాధితుల శరీరాల్లో ప్రవేశపెట్టి రోగ కారక కణాలను నిర్ధారించి చికిత్స అందిస్తారు. శరీరంలో జరిగే జీవ, రసాయన చర్యల అధ్యయనానికి ఈ వాటర్ దోహదం చేస్తుంది.
మణుగూరు భారజల కర్మాగారంలో ఆక్సిజన్–18 ఎన్‌రిచ్‌డ్ వాటర్ ఉత్పత్తితో ప్రపంచ దేశాల సరసన భారత్ చేరింది. ఇక్కడ ప్రస్తుతం ఏడాదికి 10 కేజీల ఉత్పత్తి ఉండగా గతంలో చైనా, అస్ట్రేలియా, అమెరికా, రష్యా, ఇజ్రాయిల్ దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. దీంతో దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తప్పింది. మణుగూరులో ఉత్పత్తి అవుతున్న ఆక్సిజన్ – 18 వాటర్‌ను ఇతర దేశాల్లో పరీక్షించగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నట్టు నిర్ధారించారు. ఇక్కడ ఉత్పత్తి సామర్థ్యం పెరిగితే ఇతర దేశాలకు ఆక్సిజన్ –18 ఎగుమతి చేయనుండగా లీటర్ ధర రూ.25 లక్షలు ఉంటుంది.


