రామయ్యకు కాసుల పంట
భద్రాచలం : శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి హుండీల రూపంలో కాసుల పంట పండింది. డిసెంబర్, జనవరిలో సెలవులు రావడం, ముక్కోటి ఏకాదశి ఉత్సవం తోడు కావడంతో భక్తులతో ఆలయం కళకళలాడింది. వారు హుండీల్లో సమర్పించిన కానుకలను గురువారం లెక్కించగా.. మొత్తం 70 రోజులకు గాను రూ.2,31,31,984 ఆదాయం వచ్చింది. ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో ఈఓ దామోదర్‌రావు సమక్షంలో, పటిష్ట నిఘా నడుమ ఆలయ సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు కానుకలను లెక్కించారు. పై నగదుతో పాటు 56 గ్రాముల బంగారం, 1,400 గ్రాముల వెండితో పాటు వివిధ దేశాల కరెన్సీ కూడా లభించిందని ఈఓ తెలిపారు. అనంతరం నగదును బ్యాంకు అధికారులకు అందజేశారు.
రమణీయం.. రామయ్య కల్యాణం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం రమణీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేనపూజ, పుణ్యావాచనం చేశారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివా రిని దర్శించకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
70 రోజులకు రూ.2.30 కోట్ల రాబడి


