గిరిజనుల చేపల వేట
దుమ్ముగూడెం : మండలంలోని ములకనాపల్లి ఆదివాసీలందరూ గ్రామ చెరువులో గురువారం సామూహికంగా చేపల వేట చేపట్టారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ చెరువులో వేటకు దిగడంతో సందడి నెలకొంది.
రేగళ్ల పీహెచ్‌సీలో
డీఎంహెచ్‌ఓ తనిఖీ
చుంచుపల్లి: రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ తనిఖీ చేశారు. శ్రమదానం–సమష్టి భోజనం కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చిన బాధితులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించి, జిల్లాలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో డెమో నాగలక్ష్మి, సిబ్బంది మోహన్, సలిత పాల్గొన్నారు.
బీజేపీ సత్తా చాటాలి
చుంచుపల్లి: కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని కార్పొరేషన్ ఇన్‌చార్జ్ మార్తినేని ధర్మారావు, జిల్లా ఇన్‌చార్జ్ విజయ చంద్రారెడ్డి సూచించారు. గురువారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విజయ సంకల్ప సమావేశంలో మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేయాలన్నారు. జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే అన్ని డివిజన్లలో అబ్జర్వింగ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. కేంద్రం కొత్తగూడెం కార్పొరేషన్‌లో అమృత్ 2.0 పథకం కింద రూ.120 కోట్లు కేటాయించిందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సుమారు రూ.400 కోట్లను ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకుండా ఆ నిధులను వాడుకోవడంలో విఫలమైందని విమర్శించారు. రైల్వే స్టేషన్‌ను రూ.100 కోట్లతో ఆధునికీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వీర మధుసూదన్, యానాల ముకుంద రెడ్డి, గొడుగు శ్రీధర్ యాదవ్, మాడ కృష్ణారెడ్డి, భూక్యా రవి నాయక్, శీలం విద్యాసాగర్, రాపాక రమేష్, వెంకన్న యాదవ్ పాల్గొన్నారు.
మొక్కలు నాటిన నిందితులు
భద్రాచలంటౌన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వ్యక్తులకు భద్రాచలం న్యాయమూర్తి వి.శివనాయక్ వినూత్నంగా శిక్ష విధించారు. పోలీసులు డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన 40 మందిని గురువారం కోర్టులో ప్రవేశపెట్టగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా కోర్టు ఆవరణలో మొక్కలు నాటాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో నిందితులు కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటి నీళ్లు పోశారు.
హెల్మెట్‌తో పునర్జన్మ
పాల్వంచరూరల్: అమ్మ జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుందని మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ సంగం వెంకటపుల్లయ్య అన్నారు. మండల పరిధిలోని కేశవాపురం గ్రామంలో గురువారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు శీతాకాలం ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం నిర్వహించారు. గ్రామంలో శ్రమదానం చేశారు. రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించగా, ఆయన మాట్లాడారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రమాద బాధితులను రక్షిస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.25 వేలు పొందే అవకాశం ఉందన్నారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పద్మ మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు సేవ భావంతో పనిచేయాలని సూచించారు. ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా కన్వీనర్ డాక్టర్ వేముల కామేశ్వరరావు, కె.రాంబాబు, భానుప్రవీణ్, జి.ధర్మరావు, రమేష్, శ్రీను పాల్గొన్నారు.
గిరిజనుల చేపల వేట
గిరిజనుల చేపల వేట
గిరిజనుల చేపల వేట


