
21న జిల్లాకు సీఎం
రాష్ట్రంలోనే ప్రథమ స్థానం..
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో రేవంత్ మాటామంతీ చండ్రుగొండ మండలంలో భారీ బహిరంగ సభ ? ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రాంగం ఎర్త్‌సైన్సెస్ యూనివర్సిటీకి వచ్చే అవకాశం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన దాదాపుగా ఖరారైంది. ఈనెల 21న ముఖ్యమంత్రి జిల్లాకు వస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి పనుల ప్రారంభం, సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించనున్నారు. చండ్రుగొండ మండలం బెండాలపాడును దత్తత తీసుకున్న అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ.. ఆ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు 310 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. ఇందులో కొన్నింటి నిర్మాణం పూర్తవగా, అధిక శాతం సగం, అంతకంటే ఎక్కువగా నిర్మాణ పనులు జరిగాయి. సీఎం పర్యటన నాటికి కనీసం 40 ఇళ్లకై నా అన్ని రకాల వసతులు కల్పించేలా పనుల్లో వేగం పెంచుతున్నారు. ఈ మేరకు గురువారం బెండాలపాడులో జరుగుతున్న పనులు, భద్రతా ఏర్పాట్లను ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు, నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్ పరిశీలించారు. ఇక్కడ ఇందిరమ్మ లబ్ధిదారులతో సీఎం మాటామంతి జరిపే అవకాశముంది. ఆ తర్వాత ఇదే మండలంలో దామరచర్లలో బహిరంగ సభ నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
ఎర్త్ సైన్సెస్ పరిశీలన..!
ఇటీవల జిల్లాకు మంజూరైన డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్‌కు సీఎం రేవంత్‌రెడ్డి వస్తారనే ప్రచారంతో యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. 320 ఎకరాల్లో విస్తరించిన ఈ క్యాంపస్‌లోనే పాత ఇంజనీరింగ్ కళాశాల, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిని అనుసంధానించే రోడ్లకు మరమ్మతులు, రోడ్ల పక్కన జంగిల్ కటింగ్ వంటి పనులు జరుగుతున్నాయి. అలాగే ఇంజనీరింగ్ క్యాంపస్‌కు రంగులు వేయడం, ఎర్త్ సైన్సెస్ కోర్సులు ప్రారంభించే తరగతి గదులను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవడం వంటి పనులు మొదలయ్యాయి. మరోవైపు కొత్తగూడెంలో హరిత హోటల్, కన్వెన్షన్ సెంటర్‌ను సైతం సీఎం ప్రారంభించే అవకాశం ఉంది.
చండ్రుగొండ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్రంలోనే బెండాలపాడు ప్రథమ స్థానంలో ఉందని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. గురువారం ఆయన గ్రామంలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం అధికారులు, లబ్ధిదారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ సౌరభ్‌శర్మ, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ బయ్యారపు అశోక్ పాల్గొన్నారు.