
పాలక మండలి ఏర్పాటెప్పుడో..?
● శ్రీసీతారామ చంద్రస్వామి ట్రస్ట్ బోర్డుకు గత డిసెంబర్‌లో దరఖాస్తుల స్వీకరణ ● ఏడు నెలలు గడిచినా పూర్తికాని ప్రక్రియ ● ఎదురుచూస్తున్న ఆశావహులు, భక్తులు
భద్రాచలం: ఏళ్ల తరబడి భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన పాలకమండలిని ఏర్పాటు చేయడంలేదు. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. ఆ తర్వాత అఽధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ట్రస్టు బోర్డు ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరించినా నియామక ప్రక్రియను అటకెక్కించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 13వ ట్రస్ట్ బోర్డు 2010, నవంబర్ 26 నుంచి 2012, నవంబర్ 25 వరకు పనిచేసింది. రామాలయంలో చివరి ట్రస్టు బోర్డు అదే. తెలంగాణ ఏర్పడ్డాక రెండు సార్లు అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం ట్రస్టు బోర్డును మాత్రం నియమించలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర ఆలయాలతోపాటు శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి గత డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులు కూడా స్వీకరించింది. కానీ పాలకమండలిని ప్రకటించలేదు. జిల్లాలో కేవలం పెద్దమ్మగుడి ఆలయానికి మాత్రమే పాలకమండలిని ఏర్పాటు చేసింది.
ఆశలు పెంచుకుని.. అలసిపోయి..
ట్రస్టు బోర్డు పదవుల కోసం కాంగ్రెస్ వాదులు, పార్టీ మారివచ్చిన జంప్ జిలానీలు ఆశలు పెట్టుకున్నారు. దరఖాస్తులూ సమర్పించారు. చైర్మన్, పాలక మండలి సభ్యుల పోస్టులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పైరవీలు చేశారు. 50 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నా చైర్మన్ గిరి కోసం ఐదుగురు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఇదే సమయంలో పెద్దమ్మతల్లి దేవస్థాన పాలకమండలిని ప్రకటించడం, వివాదం చెలరేగి మరో కమిటీ ప్రకటించడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రామాలయ పాలకమండలిని ప్రకటించలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో రాజధాని, మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఆశావహులు అలసిపోయి నిరాశగా ఎదురుచూస్తున్నారు.
పాలకమండలితో అభివృద్ధి సవ్యంగా..
రామాలయ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. మాఢ వీధుల విస్తరణకు నిధులను కేటాయించి భూ సేకరణ సైతం పూర్తి చేసింది. మాస్టర్‌ప్లాన్ రూపొందించాల్సి ఉంది. మరో రెండేళ్లలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాలకమండలిని నియమిస్తే భక్తులకు తగిన సౌకర్యలు కల్పించేలా మాస్టర్ రూపకల్పనలో, పుష్కరాల విజయవంతంలో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అభివృద్ధి పనులు సవ్యంగా సాగేలా చూడవచ్చు. ఇప్పటికై నా ప్రభుత్వం ట్రస్టు బోర్డును ప్రకటించాలని భక్తులు, ఆశావహులు కోరుతున్నారు.
అభివృద్ధికి దోహదం
ప్రభుత్వం జాప్యం చేయకుండా రామాలయ పాలకమండలిని ప్రకటించాలి. ట్రస్ట్ బోర్డు ఏర్పడితే ఆలయ అభివృద్ధి వేగవంతంతోపాటు గోదావరి పుష్కరాల విజయవంతానికి దోహదం చేస్తుంది.
– జోగారావు, స్థానికుడు

పాలక మండలి ఏర్పాటెప్పుడో..?