
శ్రీకనక దుర్గమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: శ్రీకనక దుర్గమ్మతల్లికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. తలనీలాలు సమర్పించారు. ఒడి బియ్యం, చీరలు, కుంకుమ, పసుపు, గాజులు అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించారు. అర్చకులు అభిషేకం జరిపారు. ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నేడు గిరిజన దర్బార్
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే దర్బార్‌లో గిరిజనులు తమ సమస్యలపై అర్జీలను అందజేయాలని పీఓ పేర్కొన్నారు.
నేడు ప్రజావాణి
సూపర్‌బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలపై లిఖిత పూర్వకంగా అర్జీలు అందజేయాలని సూచించారు.
కోయ భాషలోనే ఆదివాసీ దినోత్సవ ఆహ్వాన పత్రిక
భద్రాచలంటౌన్: ఆదివాసీ గిరిజనుల మాతృ భాషను పరిరక్షించేందుకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ఆహ్వాన పత్రికను కోయభాషలో ముద్రించినట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. యువత శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను కోయ భాష లిపితో తెలుగులో ముద్రించి పంపిణీ చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ నెల 9న ఐటీడీఏ కార్యాలయంలో జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ఆహ్వాన పత్రికలను కోయ భాష లిపితో తెలుగులో ముద్రించి, మంత్రులతో ఆవిష్కరింపజేసినట్లు వివరించారు. రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, కమిషనర్లు, స్పెషల్ కార్యదర్శులు, కలెక్టర్లకు పంపిణీ చేసినట్లు తెలిపారు.
నీట్–పీజీకి కేరళ అభ్యర్థులు
పాల్వంచ/సుజాతనగర్: వైద్య విద్య పీజీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే నీట్‌కు కేరళ అభ్యర్థులు జిల్లాలో హాజరయ్యారు. ఆదివారం దేశవ్యాప్తంగా నీట్ పీజీ పరీక్ష నిర్వహించారు. కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ వ్యాప్తి కారణంగా పరీక్ష కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుజాతనగర్‌లోని అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాల కేంద్రంలో 119 మందికిగాను 85 మంది పరీక్షకు హాజరయ్యారు. 34 మంది గైర్హాజరయ్యారు. పాల్వంచ అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాల కేంద్రంలో 100 మంది విద్యార్థులకుగాను 47 మంది పరీక్ష రాశారు. 53 మంది గైర్హాజరయ్యారు. కేరళతోపాటు తమిళనాడు తదితర రాష్ట్రాల అభ్యర్థులు కూడా పరీక్ష రాశారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

శ్రీకనక దుర్గమ్మతల్లికి విశేష పూజలు