
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
అశ్వారావుపేటరూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి శనివారం మృతి చెందాడు. ఎస్సై టీ యయాతీ రాజు కథనం ప్రకారం.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం గాంధీనగర్ ఏలూరివారి వీధికి చెందిన ఆదుర్తి శ్రీనివాస్(44) బైక్‌పై గత నెల 29వ తేదీన వేలేరుపాడు మండలం భూదేవిపేట గ్రామానికి వచ్చి వెళ్లున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలోని అశ్వారావుపేట మండలం కొత్తూరు గ్రామ సమీపంలో అదుపుతప్పి కింద పడ్డాడు. దీంతో తీవ్రగాయాలు కాగా కుటుంబీకులు రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడికి భార్య ప్రసన్నరాణి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రైతు ఆత్మహత్యాయత్నం
ఇల్లెందురూరల్: అటవీశాఖ అధికారులు తన సాగు భూమిని లాక్కున్నారనే ఆవేదనతో మండలంలోని పూబెల్లి గ్రామానికి చెందిన రైతు మోకా రమేష్ శనివారం ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికుల కథన ప్రకారం.. పూబెల్లి గ్రామ శివారులో తొమ్మిదిన్నర ఎకరాల విస్తీర్ణంలో రమేష్ కుటుంబ సభ్యులు సాగు చేసుకుంటున్నారు. ఇందులో ఎకరన్నర ఇటీవలే పోడు నరికినట్లు గుర్తించి అటవీశాఖ అధికారులు సదరు భూమిని స్వాధీనం చేసుకున్నారు. ట్రెంచ్ కొడుతుండగా రమేష్ అక్కడకు చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో రైతుకు, అటవీ అధికారులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఖమ్మం సిఫారసు చేశారు. కాగా ఘర్షణతో బీట్ అధికారి రాణికి బీపీ తగ్గడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. రైతు రమేష్ 1.5 ఎకరాల విస్తీర్ణంలో పోడు నరికినట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నామని ఇల్లెందు రేంజ్ అధికారి చలపతిరావు తెలిపారు.
వెదురు గడలు స్వాధీనం
జూలూరుపాడు: మండలంలోని పాపకొల్లు అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న వెదురు గడలను శనివారం అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి జూలూరుపాడు అటవీ రేంజ్ పరిధి పాపకొల్లు–బీ బీట్ నుంచి వెదురు గడలు తరలిస్తుండగా ఎఫ్‌ఎస్‌ఓ మల్లయ్య, ఎఫ్‌బీఓలు విజయలక్ష్మి, శ్రావణ్ కుమార్, ఎస్కే రహీం, బి.నరసింహారావు వెళ్లి తనిఖీలు చేపట్టారు. భేతాళపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అటవీ ప్రాంతంలో వెదురు గడలను నరికి ట్రాక్టర్‌లో తరలిస్తుండగా రాంపురంతండా గ్రామ సమీపంలో పట్టుకున్నారు. గడల విలువ రూ.28,690, వాహనాన్ని సీజ్ చేశామని, డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.