
యూరియా పంపిణీలో ఆలస్యం..!
కరకగూడెం: మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సేల్ పాయింట్‌లో శనివారం పీఓఎస్ మిషన్ పనిచేయలేదు. దీంతో యూరియా పంపిణీలో ఆలస్యం కాగా, రైతులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో సిబ్బందికి, రైతులకు మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మిషన్‌లో చిన్న సమస్య తలెత్తడంతో కొత్తగూడెం తీసుకెళ్లి మరమ్మతులు చేయించామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏఓ ఛటర్జీ తెలిపారు.
మాంసం దుకాణదారులకు జరిమానా
అశ్వారావుపేటరూరల్: మున్సిపాలిటీ పరిధి లోని భద్రాచలం మార్గంలో ఉన్న చికెన్, మట న్, చేపల దుకాణాలను శనివారం కమిషనర్ బి.నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాంసం దుకాణాల వద్ద పరిశుభ్రత లేకపోవడం, దుమ్ము, ధూళి పడకండా రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో జరిమానా విధించారు. ఒక్కో దుకాణానికి రూ.వెయ్యి చొప్పున మొత్తం ఆరు దుకాణాలకు రూ.6వేల జరిమానా విధించి రశీదులు అందించారు. ఈ సందర్భంగా కమి షనర్ మాట్లాడుతూ వ్యాపారులు మున్సిపల్ నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
మణుగూరుటౌన్: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన సంఘటన మున్సిపాలిటీ పరిధి లోని రాజీవ్‌గాంధీనగర్ శివారులో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కట్టుమల్లారానికి చెందిన కంగాల శ్రీను(48) శుక్రవారం రాత్రి కాసినకుంట చెరువులో చేపల వేటకు వెళ్లాడు. శనివారం తెల్లవారుజామున చెరువులో వలకు చిక్కుకుని మృతి చెంది ఉన్నాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

యూరియా పంపిణీలో ఆలస్యం..!