
ఆశ్రమ విద్యార్థుల ఆందోళన
దమ్మపేట: ఉదయం సరైన సమయానికి అల్పాహారం అందడం లేదని మండల పరిధిలోని చీపురుగూడెంలో ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం విద్యార్థులు మాట్లాడుతూ హాస్టల్‌లో వసతులు, పారిశుద్ధ్య నిర్వహణ సరిగాలేదని వాపోయారు. మెనూ సక్రమంగా అమలు చేయడంలేదని, ఆహార పదార్థాల్లో నాణ్యత ఉండటం లేదని పేర్కొన్నారు. ఫ్యాన్లు లేవని, తాగునీటి సౌకర్యం సక్రమంగా లేదని తెలిపారు. దీంతో తరచూ అనారోగ్యం బారిన పడుతున్నామని చెప్పారు. దీంతో సాయంత్రం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఐటీడీఏ డీడీ మణెమ్మ, ఏటీడీఓ చంద్రమోహన్‌లు పాఠశాలకు వచ్చి విచారణ జరిపారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కొద్ది రోజులుగా ఆహార పదార్థాల్లో నాణ్యత ఉండటం లేదని, వసతుల కల్పన సరిగా లేదని విద్యార్థులు వారి ఎదుట ఆవేదన చెందారు. మెనూ సక్రమంగా అమలు చేయడం లేదని తేలడంతో ప్రాథమిక విచారణ ఆధారంగా ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం సునీతను తాత్కాలికంగా భద్రాచలం ఐటీడీఏ కార్యాలయానికి సరెండర్ చేస్తున్నామని డీడీ తెలిపారు. విద్యార్థుల నుంచి పూర్తిస్థాయిలో సేకరించి పీఓకు నివేదిక అందజేస్తామని తెలిపారు. తుది నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
పాఠశాలలో విచారణ చేపట్టిన ఎమ్మెల్యే, ఐటీడీఏ డీడీ

ఆశ్రమ విద్యార్థుల ఆందోళన