రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారికి శుక్రవారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
నిత్యాన్నదానానికి విరాళం
రామాలయంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన భక్తురాలు సీహెచ్ సరస్వతి రూ.2 లక్షల చెక్కును ఆలయ ఈఓ ఎల్.రమాదేవికి అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిచారు. ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదంతోపాటు జ్ఞాపికను అందజేశారు.
పెద్దమ్మతల్లికి
పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి అర్చకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు అర్చకులు పంచామృతంతో అభిషేకపూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలు, కుంకుమ పూజ, గణపతి హోమం నిర్వహించారు.
గిరిజన గురుకుల కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో మొత్తం సీట్ల్లు భర్తీ అయ్యాయని పీఓ బి.రాహుల్ తెలిపారు. గురుకులాల్లో బాలికలకు 737సీట్లు ఉండగా, భద్రాచలంలోని గురుకుల కాలేజీలో శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన విద్యార్థినుల్లో 737మందికి మెరిట్ ఆధారంగా వారు కోరుకున్న కాలేజీల్లో సీట్లు కేటాయించామని పీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌సీఓలు అరుణకుమారి, పద్మావతి, ప్రిన్సిపాళ్లు చైతన్య, నాగేంద్రమ్మ, రాణి, ఓ.మాధవి, సంధ్యారాణి, మాధవీలత, ఓ.పుల్లమ్మ పాల్గొన్నారు.
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన


