మణుగూరు టౌన్: ప్రేమించిన యువతి కాదనడంతో మనస్తాపానికి గురైన యువకుడు సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం... మండలంలోని వాసవీనగర్‌కి చెందిన సుగ్గల కార్తీక్(26) ఓ యాప్‌లో పరిచయమైన యువతిని ప్రేమించాడు. పెళ్లిచేసుకునేందుకు ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపం చెంది ఇంట్లోనే ఓ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. తల్లిదండ్రులు గుంటూరు వెళ్లగా, సోదరుడు మరో గదిలో ఉన్నాడు. గమనించి సోదరుడు స్థానికుల సాయంతో కిందకు దింపి 100 పడకల ఆస్పత్రికి తరలించాడు. పరీక్షంచిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. కాగా ఎదిగి వచ్చిన కుమారుడు ప్రేమ అంటూ ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. వారి రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి.
మనస్తాపంతో వివాహిత..
పాల్వంచరూరల్: పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సోమవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధి సారెకల్లు గ్రామానికి చెందిన మడకం రాఖి(21) మద్యానికి అలవాటుపడటంతో భర్త రామ మందలించాడు. దీంతో మనస్తాపం చెంది ఈ నెల 21న పురుగుల మందు తాగగా, గమనించిన కుటుంబ సభ్యులు పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అక్కడి నుంచి కొత్తగూడెం సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.
ములకలపల్లిలో యువకుడు..
ములకలపల్లి: ఉరి వేసుకుని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన గుట్టగూడెం గ్రామంలో సోమవారం జరిగింది. ఎస్సై కిన్నెర రాజశేఖర్ కథనం ప్రకారం.. గుట్టగూడెం గ్రామానికి చెందిన గుండి భారతి, అర్జున్ దంపతులకు కుమారుడు చైతన్య (19), కూతురు కల్యాణి ఉన్నారు. చైతన్య చెడు వ్యసనాలకు గురై చదువు మానేసి ఇంటి వద్దనే ఉంటుండగా ఆదివారం రాత్రి తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెంది గ్రామ శివారులోని పాఠశాల ఆవరణలో నిద్రించేందుకు వెళ్లాడు. తెల్లవారుజామునే చెట్టుకు ఉరి వేసుకోగా, స్థానికులు గమనించి సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వచ్చి ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.