
‘పది’ పరీక్షలు షురూ..
● జిల్లాలో 99 శాతం హాజరు నమోదు ● పటిష్ట పోలీస్ బందోబస్తు.. ● కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించాలని కలెక్టర్ ఆదేశం
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు 99 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. జిల్లాలోని 73 కేంద్రాల్లో 12,269 మంది విద్యార్థులకు గాను 12,235 మంది హాజరు కాగా, 34 మంది గైర్హాజరయ్యారు. ప్రైవేట్ విద్యార్థులు 25 మందికి 18 మంది హాజరయ్యారు. అన్ని కేంద్రాల్లోనూ విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోపలికి పంపించారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులు అనారోగ్యానికి గురైతే ప్రథమ చికిత్స అందించేందుకు ప్రతీ కేంద్రంలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు విధులు నిర్వర్తించారు. పరీక్ష కేంద్రాల వద్దకు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు భారీగా చేరుకోవడంతో సందడి వాతావరణం కనిపించింది. మొదటి రోజున ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాకుండా ప్రశాంతంగా జరిగాయి. పరీక్షల అనంతరం పోలీసు బందోబస్తు నడుమ సమాధానపత్రాలను పోస్టాఫీస్‌లకు తరలించారు. ఇక పాత కొత్తగూడెంలోని తెలంగాణ స్కూల్‌కు సంబంధించిన విద్యార్థుల హాల్ టికెట్లపై గతేడాది లాగే ఆనందఖని పాఠశాల అని పేర్కొనడం, కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు బయట ఒక బోర్డు, హాల్ టికెట్‌పై మరో పేరు ఉండడంతో ఆయా విద్యార్థులు, తల్లిదండ్రులు కొంత ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత అక్కడి సిబ్బందిని అడిగి సందేహాలు నివృత్తి చేసుకున్నారు. ఇక పరీక్ష సమయానికంటే ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని అధికారులు ముందే ప్రకటించినప్పటికీ.. విద్యార్థులంతా ముందుగానే ఆయా కేంద్రాల వద్దకు చేరుకోవడం విశేషం.
అధికారులు, స్క్వాడ్ బృందాలు తనిఖీ..
జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాలను స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. కొత్తగూడెంలోని లిటిల్ బర్డ్స్, పాల్వంచ కేటీపీఎస్ కాలనీలోని జెడ్పీ ఉన్నత పాఠశాల కేంద్రాలను కలెక్టర్ జితేష్ వి పాటిల్ తనిఖీ చేశారు. డీఈఓ వెంకటేశ్వరాచారి ఏడు కేంద్రాలను తనిఖీ చేయగా మిగితా కేంద్రాలను ఇతర అధికారులు పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన వసతులపై కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వసతుల కల్పనపై పలు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద శుభ్రంగా ఉండాలని, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా తగిన వసతులు కల్పించాలని సూచించారు.

‘పది’ పరీక్షలు షురూ..

‘పది’ పరీక్షలు షురూ..