శ్రీరంగనాథ స్వామి ఆశ్రమ సేవా కార్యక్రమాలు
● ప్రతీ గురువారం నిరుపేదల ఇంటి వద్దకే భోజనం ● నిర్వహణతోపాటు ఆర్థికంగా తోడ్పడుతున్న స్థానికురాలు శ్రీదేవి ● దాతలు, మిత్రుల సహకారంతో వారానికోసారి అన్నదానం
శ్రీ రంగనాథ స్వామి ఆశ్రమం (ఫైల్) (ఇన్‌సెట్) షిరిడీ సాయిబాబా
శ్రీ రంగనాథ స్వామి ఆశ్రమం అన్నార్తుల ఆకలి తీర్చుతోంది. పరిసర ఐదారు గ్రామాల్లోని అనాథలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రతి గురువారం వారి ఇంటివద్దకే భోజనాలు పంపిస్తోంది. దాతల సహకారంతో వారంలో ఒకసారి 200 మందికి ఆహారం అందిస్తోంది. శివనామస్మరణకు వచ్చిన భక్తుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, స్థానిక మహిళ ఒకరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. ఆర్థికంగా అండగా నిలుస్తోంది. –దమ్మపేట
ఆశ్రమ ప్రస్థానం
దేశంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలు శ్రీశైలం, శ్రీకాళహస్తి, అరుణాచలం, కాశీ వంటి సమీప ఆశ్రమాల్లో శివ నామస్మరణ సాధన చేసిన రంగనాథస్వామి అనే భక్తుడు 2017లో మండలంలోని ముష్టిబండ గ్రామ శివారులో వేంచేసియున్న స్వయంభూ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ సన్నిధికి చేరుకున్నాడు. శివాలయం సమీపంలో గుట్టపై ప్రశాంత వాతావరణం ఉండటంతో ధ్యానం చేయసాగాడు. దీంతో పలువురు భక్తులు కూడా ధ్యానానికి రావడం ప్రారంభించారు. భక్తుల సంఖ్య క్రమేపీ పెరగడంతో దాతల సహకారంతో 2021లో చిన్నపాటి భవనం నిర్మించి ఆశ్రమం ప్రారంభించాడు. అప్పటి నుంచి ప్రతి గురువారం అన్నదానం చేస్తున్నాడు. తొలుత 11 మందితో అన్నదానం ప్రారంభమైంది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి..
ముష్టిబండకే చెందిన యూకేలో, అనంతరం బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసిన కూకలకుంట శ్రీదేవి గ్రామానికి వచ్చినపుడు ఆశ్రమానికి ఆర్థికసాయం అందించేంది. 2018లో నెలకు రూ.1.20 లక్షల ఉద్యోగం మానేసి ఆశ్రమంలో సేవకు అంకితమై నిర్వహణ బాధ్యతలు చూసుకుంటోంది. విదేశాల్లో ఉంటున్న తన సోదరి, మిత్రుల సహకారంతో అన్నదానం కార్యక్రమం కొనసాగిస్తోంది. ప్రస్తుతం ప్రతి గురువారం సుమారు 200 మందికి భోజనాలు అందిస్తున్నారు. దాతలు, సేవకుల సహకారంతో ఆశ్రమం వద్దనే వంట చేసి, పార్సిళ్లు కట్టించి నిరుపేదల ఇంటికి చేర్చుతున్నారు. ముష్టిబండ, వడ్లగూడెం, మందలపల్లి, మల్కారం తదితర గ్రామాల్లో అనాథలు, వృద్ధులు, దివ్యాంగులకు ఆకలి తీర్చుతున్నారు. సమీప గ్రామాలకు చెందిన సుమారు 10 మంది వరకు మహిళలు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు.
ఇతర సేవా కార్యక్రమాలు
ఆశ్రమం ఆధ్వర్యంలో చలికాలంలో దుప్పట్లు, స్వెటర్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కరోనా సమయంలోబాధితులకు నిత్యావసరాలను వితరణ చేశారు. ప్రతి గురువారం పేదల ఇంటి వద్దకే భోజనం పంపిస్తున్నామని దాతల సహకారం అందిస్తే ఆశ్రమంలోనే అనాధ శరణాలయం ప్రారంభిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.
2023లో సాయిబాబా ఆలయ నిర్మాణం
ఆశ్రమంపై మొదటి అంతస్తులో షిరిడీ సాయిబాబా ఆలయం నిర్మించారు. ఆశ్రమ బాధ్యురాలైన శ్రీదేవి తన సొంత డబ్బులతో పాటు దాతలు, బంధువులు, మిత్రుల ఆర్థిక సహాయ సహకారాలతో ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. ఆలయంలో శ్రీదత్తాత్రేయ, గణపతి సహిత సాయిబాబా విగ్రహాలను ప్రతిష్టించారు. 2023 అక్టోబర్ 23న ఆలయం ప్రారంభంకాగా, 2024 అక్టోబర్ 21న విగ్రహా ప్రతిష్ఠాపన జరిగింది.
అన్నార్తులకు అండగా..
అన్నార్తులకు అండగా..