సొమ్ము స్వాహాపై విచారణ ! | Sakshi
Sakshi News home page

సొమ్ము స్వాహాపై విచారణ !

Published Tue, Apr 23 2024 8:35 AM

- - Sakshi

దమ్మపేట : ‘సీ్త్ర నిధి సొమ్ము.. సీసీ స్వాహా?’ శీర్షికతో ఆదివారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సీ్త్ర నిధి ఆర్‌ఎం సంపత్‌ సోమవారం దమ్మపేటలోని ఐకేపీ కార్యాలయానికి వచ్చి సీ్త్ర నిధి సొమ్మును సొంత ప్రయోజనాలకు వాడుకున్న సంజీవని క్లస్టర్‌ సీసీ కృష్ణవేణిని విచారించినట్టు సమాచారం. ప్రస్తుతం సీ్త్ర నిధికి చెల్లించాల్సిన రూ.మూడు లక్షల దుర్వినియోగం ఆరోపణలపై ఆరా తీసి, గ్రామ దీపికలను కూడా విచారించారని తెలిసింది. సదరు సీసీకి సీ్త్ర నిధి డబ్బులు ఇచ్చినట్టు గ్రామ దీపికల వద్ద ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించినట్టు సమాచారం. కాగా ఈ విచారణపై వివరణ కోరేందుకు ఆర్‌ఎం, దమ్మపేట ఏపీఎం నాగేశ్వరరావును రెండుసార్లు ఫోన్‌లో సంప్రదించగా వారు స్పందించలేదు.

లక్ష్య సాధనకు సమష్టిగా కృషి చేయాలి

సింగరేణి డైరెక్టర్లు శ్రీనివాస్‌, వెంకటేశ్వరరెడ్డి

మణుగూరు టౌన్‌: సింగరేణి మణుగూరు ఏరియాలో నిర్దేశిత ఉత్పత్తికి కార్మికులు, అధికారులు సమష్టిగా కృషి చేయాలని డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌, పా) ఎస్‌వీకే శ్రీనివాస్‌, డైరెక్టర్‌(పీఅండ్‌పీ) వెంకటేశ్వరరెడ్డి అన్నారు. సోమవారం వారు పీకేఓసీ–2, పీకేఓసీ–4లో వ్యూ పాయింట్‌ వద్ద బొగ్గు ఉత్పత్తిని పరిశీలించారు. అనంతరం ఓసీ–2 నూతన సైట్‌ ఆఫీస్‌లోని కనకదుర్గ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాంత్రిక, శ్రామిక శక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకుని నిర్దేశిత వార్షిక లక్ష్యాన్ని అధిగమించాలని సూచించారు. కార్యక్రమంలో ఏరియా జీఎం దుర్గం రాంచందర్‌, ప్రాజెక్ట్‌ అధికారి లక్ష్మీపతిగౌడ్‌, అధికారులు వెంకటేశ్వర్లు, రమేశ్‌, వెంకట్రావ్‌, రాంబాబు, వీరభద్రుడు, రమణారెడ్డి, లింగబాబు, శ్రీనివాస్‌, షబ్బీరుద్దీన్‌, చిట్టా శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ‘టెలీమానస్‌’

కొత్తగూడెంరూరల్‌: ఈ నెలలో పదో తరగతి, ఇంటర్‌ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నందున విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి, భయాందోళనలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెలీమానస్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ శిరీష తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా సైకాలజిస్ట్‌లను నియమించిందని పేర్కొన్నారు. విద్యార్థులు ఎవరైనా తాము ఒత్తిడికి గురవుతున్నామని అనిపిస్తే 14416 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. సైకాలజిస్ట్‌లు తగు సూచనలు చేస్తారని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రేషన్‌ డీలర్‌ను బెదిరించిన ఘటనలో కేసు నమోదు

పాల్వంచ : డబ్బులు ఇవ్వాలంటూ రేషన్‌ డీలర్‌ను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న యూ ట్యూబ్‌ చానల్‌ విలేకరిపై పాల్వంచ పట్టణ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పట్టణంలోని బొల్లేరుగూడేనికి చెందిన రేషన్‌డీలర్‌ మానేపల్లి వెంకటేశ్వరరావును యూట్యూబ్‌ చానల్‌ రిపోర్టర్‌నంటూ జయంత్‌ అనే బెదిరిస్తూ డబ్బు డిమాండ్‌ చేస్తున్నాడు. తనకు రూ.30 వేలు ఇవ్వకుంటే బయటి నుంచి బియ్యం బస్తాలు తెచ్చి షాపు ముందు పడేసి ఫొటోలు, వీడియోలు తీసి పోలీసులకు పట్టిస్తానని బెదిరించసాగాడు. ఈ క్రమంలో వెంకటేశ్వరరావు రూ.24వేలు ఇచ్చా డు. మిగితా రూ.6వేలు కూడా ఇవ్వాలంటూ రాత్రి వేళల్లో సైతం వచ్చి భయబ్రాంతులకు గురిచేస్తుండడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు జయంత్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ బి.రాము తెలిపారు.

కారేపల్లి సంతగుడి ఉద్యోగిపై సస్పెన్షన్‌ వేటు

కారేపల్లి: దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యాన కారేపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం నిర్వహిస్తున్న వారాంతపు సంత జూనియర్‌ అసిస్టెంట్‌ పగడాల మోహన్‌కృష్ణపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈమేరకు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ శ్రీకాంతారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కారేపల్లి సంతలో అవకతవకలు జరుగుతున్నట్లు డీసీకి కొందరు ఫిర్యాదు చేయగా, ఆదివారం సంతను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈక్రమాన 60మేకలతో వెళ్తున్న వాహనాలను తనిఖీ చేయగా 23మేకలకే రుసుం చెల్లించినట్లు రశీదు ఉండడంతో రూ.4,500 జరిమానా విదించారు. ఈమేరకు విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని తేలడంతో జూనియర్‌ అసిస్టెంట్‌ను సస్పెండ్‌ చేశారని ఈఓ నల్లమోతు శేషయ్య తెలిపారు. అయితే, ఉత్తర్వులను తీసుకునేందుకు ఆయన నిరాకరించడంతో రిజిస్టర్‌ పోస్టు ద్వారా పంపనున్నట్లు దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ సమత పేర్కొన్నారు.

యువకుడి ఆత్మహత్య

ఇల్లెందురూరల్‌: మండలంలోని తిలక్‌నగర్‌ గ్రామపంచాయతీ పూసపల్లి గ్రామంలో సకినాల సాహిత్‌ (30) సోమవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వివాహం చేసుకున్న సాహిత్‌ ఆమెతో ఏర్పడిన మనస్పర్థలు, కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.

Advertisement
Advertisement