సర్వేపైనే ఆశలు | - | Sakshi
Sakshi News home page

సర్వేపైనే ఆశలు

Mar 1 2026 7:48 AM | Updated on Mar 1 2026 7:48 AM

సర్వేపైనే ఆశలు

సర్వేపైనే ఆశలు

శరవేగంగా సాగుతున్న అర్హుల గుర్తింపు ప్రక్రియ బాధితుల్లో ఇతర జిల్లాలు, ఏపీ వాసులు కూడా.. సర్వే అనంతరం అర్హులకు పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్‌ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారిలో అర్హులను గుర్తించే ప్రక్రియ వేగవంతమైంది. శుక్రవారం ప్రారంభమైన సామాజిక, ఆర్థిక సర్వే శనివారం కూడా కొనసాగింది. జిల్లావ్యాప్తంగా 21మంది తహసీల్దార్లు సర్వేలో పాల్గొంటున్నారు. భూదాన్‌ భూముల్లో మొత్తం 705 ఇళ్లను కూల్చగా.. అందులో ఖమ్మం జిల్లాతో పాటు ఇతర జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన వారు ఉన్నట్లు తేల్చారు. ఈమేరకు సర్వే పూర్తయ్యాక అర్హులకు ఇళ్లస్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించనున్నట్లు కలెక్టర్‌ అనుదీప్‌ తెలిపారు.

స్వగ్రామాల్లో వివరాల సేకరణ

ఇళ్లు కోల్పోయిన వారిలో నిజమైన అర్హులను తేల్చేందుకు ప్రభుత్వం సర్వే చేపడుతోంది. జిల్లాలోని 21మంది తహసీల్దార్లు, సిబ్బంది ఇందులో పాలు పంచుకున్నారు. రెండు రోజులుగా రెవెన్యూ సిబ్బంది టీటీడీసీ, అంబేద్కర్‌ భవన్‌లో ఉంటున్న బాధితులతో మాట్లాడి పేరు, గ్రామం, కుటుంబ నేపథ్యం, ఇతర వివరాలు, ప్రభుత్వం నుంచి గతంలో సాయం పొందారా.. సొంత ఇల్లు ఉందా.. తదితర వివరాలు సేకరించారు. ఇందులో ఇతర ప్రాంతాల వారి విషయమై అక్కడి తహసీల్దార్లకు సమాచారం ఇచ్చి వివరాలు సేకరిస్తున్నారు.

ఇతర జిల్లాలు, రాష్ట్రాల బాధితులు

రెవెన్యూ అధికారుల సర్వేలో భూదాన్‌ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారు ఏయే ప్రాంతాల వారో తేలింది. ఆపై వారి సామాజిక, ఆర్ధిక స్థితిగతులు ఆరా తీస్తున్నారు. ఇళ్లు కోల్పోయిన వారిలో ఖమ్మం జిల్లాతోపాటు భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌, హన్మకొండ, మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లాల వారే కాక ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల వాసులు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఖమ్మం అర్బన్‌ మండలానికి చెందిన బాధితులు 182 మంది, జిల్లాలోని ఇతర మండలాలకు చెందిన వారు 340 మంది ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల వారు 107 మంది, ఏపీ రాష్ట్రానికి చెందిన వారు ఇద్దరు ఉన్నారు.

కొనసాగిన పరామర్శలు

వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు పరామర్శలు శనివారం కూడా కొనసాగాయి. వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు భూదాన్‌ భూములను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా అండగా నిలుస్తామని, భూదాన్‌ భూముల్లోనే ప్రభుత్వం ఇళ్లు కట్టించేలా ఒత్తిడి తీసుకొస్తామని భరోసా కల్పించారు. బీజేపీ జాతీయ నాయకుడు, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న, విమలక్క తదితరులు పర్యటించారు. బతుకు దెరువు కోసం వలస వచ్చిన నిరుపేదలు గుడిసెలు వేసుకుంటే కూలగొట్టడం ఏమిటని నేతలు ప్రశ్నించారు.

భూదాన్‌ భూముల్లో కూల్చిన ఇళ్లు 705

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement