వేణుగోపాలుడి కల్యాణానికి వేళాయె..
బూర్గంపాడు: పవిత్ర గోదావరి ఒడ్డున ఇరవెండి గ్రామంలో కొలువుదీరిన శ్రీ సంతాన వేణుగోపాలస్వామి తిరుకల్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయానికి రంగులు వేసి సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి కల్యాణం జరుగనుంది. కల్యాణానికి ముందు ధ్వజారోహణం, గరుడముద్ద ల కార్యక్రమం నిర్వహిస్తారు. పిల్లలు లేనివారు గరుడముద్దలు స్వీకరిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామివారి ఆలయానికి ఎదురుగా అష్టభుజాలు కలిగిన సత్తెమ్మతల్లి ఆలయం ఉండగా ఆ తల్లి స్వామివారికి రక్షణగా ఉండేదని పూర్వీకులు చెబుతుంటారు. పూర్వం స్వామివారిని పూజించేందుకు వెండితో చేసిన పూలు వాడేవారని, అందుకే ఈ గ్రామానికి విరివెండిగా, ఆ తర్వాత ఇరవెండిగా పేరొచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. కల్యాణాన్ని తిలకించేందుకు జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. కల్యాణోత్సవ ఏర్పాట్లను తాళ్లూరి ట్రస్ట్ వ్యవస్థాపకులు తాళ్లూరి పంచాక్షరయ్య, తానా మాజీ అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్, సర్పంచ్ గుండి బాబూరావు.మాజీ ఎంపీటీసీ సభ్యులు వల్లూరిపల్లి వంశీకృష్ణ పర్యవేక్షిస్తున్నారు.
ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ


