ప్రజలకు తోడుగా నిలిస్తేనే గుర్తింపు
● సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు ● ఖమ్మంలో యర్రా శ్రీకాంత్ విగ్రహావిష్కరణ
ఖమ్మంమయూరిసెంటర్: ప్రజల కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తూ, వారి సమస్యల పరిష్కారం కోసం శ్రమించడమే కమ్యూనిస్టు కార్యకర్తకు అసలైన గుర్తింపు అని.. ఆ విషయంలో యర్రా శ్రీకాంత్ ఆదర్శంగా నిలిచారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీ.వీ.రాఘవులు కొనియాడారు. ఖమ్మం బోసు బొమ్మ సెంటర్‌లో ఏర్పాటుచేసిన శ్రీకాంత్ విగ్రహాన్ని శనివారం ఆవిష్కరించాక, సీపీఎం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. కమ్యూనిస్టులు ప్రజల మధ్య నీటిలో చేపలా ఉండాలని, శ్రీకాంత్ అదే మార్గం అనుసరించినందునే ఇప్పుడు ఘన నివాళి అర్పిస్తున్నారని చెప్పారు. రాబోయే కేఎంసీ ఎన్నికల్లోనూ ప్రజల పక్షాన నిలబడే వారినే గెలిపించాలని ఆయన కోరారు. కాగా, మోదీ పాలనలో దేశ ప్రజాస్వామ్యం, లౌకికవాదం ప్రమాదంలో పడ్డాయని తెలిపారు. బూర్జువా పార్టీలు రకరకాల రూపాల్లో ప్రజలను ఆకర్షిస్తాయని, కులమత భావాలను రెచ్చగొట్టి వారి మార్గంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తాయని చెప్పారు. ఈమేరకు కమ్యూనిస్టులు ప్రజల్లో ఉంటూ వారిని మేల్కొల్పాలని సూచించారు.
సీపీఎం పోరాటాలతోనే పేదలకు పట్టాలు
సీపీఎం పోరాట ఫలితంగానే ఖమ్మంలో 6,670 మంది పేదలకు ఇళ్ల పట్టాలు వచ్చాయని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. ఈ పోరాటంలో శ్రీకాంత్ కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. కాగా, భూదాన్ భూముల్లో పదేళ్లుగా పేదలు ఉంటుండగా, ఇప్పుడు ఇళ్లు కూల్చడం ఏమిటని ప్రశ్నించారు. తొలుత ఖమ్మం గాంధీచౌక్ నుంచి బోసు బొమ్మ సెంటర్ వరకు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించగా, శ్రీకాంత్ మనవళ్లు ప్రదర్శించిన కర్రసాము ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర, జిల్లా నాయకులు మాచర్ల భారతి, బండి రమేష్, కళ్యాణం వెంకటేశ్వరరావు, బుగ్గవీటి సరళ, బొంతు రాంబాబు, యర్రా శ్రీనివాసరావు, బండి పద్మ, మాదినేని రమేష్, పొన్నం వెంకటేశ్వర్లు, పి.సోమయ్య, ఎం.సుబ్బారావు, యర్రా రమేష్, యర్రా రంజిత్, చింతలచెరువు కోటేశ్వరరావు, శీలం సత్యనారాయణరెడ్డి, మడుపల్లి గోపాల్‌రావు, కార్పొరేటర్లు యర్రా గోపి, యల్లంపల్లి వెంకట్రావు, శ్రీకాంత్ సతీమణి యర్రా సుకన్య తదితరులు పాల్గొన్నారు.


