● కేంద్ర వాణిజ్య శాఖ ఆర్థిక సలహాదారు ప్రియా పి.నాయర్ ● గుంటూరు పొగాకు బోర్డు సందర్శన ● వేలం పాటల పరిశీలన.. రైతులు, వ్యాపారులతో సమావేశం ● గిట్టుబాటు ధర, పంట బీమా, ఎగుమతుల ప్రోత్సాహంపై చర్చ
కొరిటెపాడు(గుంటూరు): పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సమతుల్య విధానంతో ముందుకెళ్తుందని కేంద్ర వాణిజ్య శాఖ ఆర్థిక సలహాదారు ప్రియా పి.నాయర్ తెలిపారు. బుధవారం గుంటూరులోని పొగాకు బోర్డును సందర్శించిన ఆమె పొగాకు రంగం పనితీరు, వేలం పాటలు, రైతుల సమస్యలపై సమీక్షించారు. తొలుత వెల్లంపల్లి వేలంపాట కేంద్రం (ఏఎఫ్ఎఫ్ నం.31)ను సందర్శించి పొగాకు కొనుగోళ్లను పరిశీలించారు. అనంతరం పొగాకు బోర్డు కార్యాలయంలో చైర్మన్ చిడిపోతు యశ్వంత్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. రైతులు, వ్యాపార ప్రతినిధులు గిట్టుబాటు ధర, పంట పరిమాణం నిర్ధారణ, అమ్ముడుపోని నిల్వల సత్వర విక్రయాలు, వాతావరణ ఆధారిత పంట బీమా, సిబ్బంది బలోపేతం, ఎగుమతుల ప్రోత్సాహం తదితర అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. పొగాకు వేలం పాటల్లో మెరుగైన పోటీ ఉండేలా ప్రధాన కంపెనీలు అన్ని కేంద్రాల్లో చురుగ్గా పాల్గొనాలని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.విశ్వశ్రీ సూచించారు. పంట పరిమాణం, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా రైతులు, వ్యాపారుల మధ్య సమన్వయం అవసరమని బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ పేర్కొన్నారు. రైతులు, వ్యాపారులు, బోర్డు అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే పొగాకు రంగం స్థిరమైన అభివృద్ధి సాధిస్తుందని ప్రియా పి.నాయర్ తెలిపారు. సమావేశంలో దక్షిణ, ఉత్తర ప్రాంతాల పొగాకు రైతులు, వ్యాపార ప్రతినిధులు, బోర్డు అధికారులు పాల్గొన్నారు.
పట్నంబజారు: గంజాయి మత్తులో యువకుడు వీరంగం సృష్టించిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నెహ్రూనగర్‌కు చెందిన టి.వెంకటేశ్వరరావు అనే వ్యక్తి రాజేంద్రకి తన నివాసం అద్దెకు ఇచ్చాడు. మంగళవారం రాత్రి సమయంలో వెంకటేశ్వరరావు తన వాహనాన్ని ఇంటి ముందు పార్కింగ్ చేసే క్రమంలో రాజేంద్ర కుమారుడు గంగాధర్‌తో వివాదం జరిగింది. గంజాయి మత్తులో ఉన్న గంగాధర్ వెంకటేశ్వరరావుపై దాడిచేసి కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. ఈవిషయంపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా గంగాధర్ ప్రవర్తన ఇదేవిధంగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.
తెనాలిరూరల్: కోర్టు వాయిదాకు హాజరైన భార్యపై భర్త దాడి చేయడంపై కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాపట్ల జిల్లా అమృతలూరు మండలం వామనగుంటపాలేనికి చెందిన ఆరెమండ అలేఖ్యకు మూడేళ్ల కిందట అమరావతి మండలం వైకుంఠపురం గ్రామానికి చెందిన భోగినేని సూర్యప్రకాశ్‌తో వివాహమైంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. అక్టోబరు 5వ తేదీన కోర్టు వాయిదాకు వచ్చి తిరిగి వెళుతున్న అలేఖ్యను టీజే కళాశాల సమీపంలో సూర్యప్రకాశ్ అటకాయించి ఆమైపె దాడి చేశాడు. బాధితురాలు బుధవారం పోలీసులను ఆశ్రయించగా వన్ టౌన్ ఎస్ఐ రాజ్యం కేసు నమోదు చేశారు.


