నరసరావుపేట ఈస్ట్: పాఠశాలల్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎస్‌ఏ–1 పరీక్షల పర్యవేక్షణ పేరుతో చేపట్టిన అబ్జర్వర్లు నియామకపు విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఎస్టీయూ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.ఏమండీ డిమాండ్ చేశారు. ఉప్పలపాడు జెడ్పీ హైస్కూల్‌లో బుధవారం ఆయన మాట్లాడుతూ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్‌లను ఇతర పాఠశాలలకు అబ్జర్వర్లుగా నియమించటం వలన బోధన విధులు నిర్వహించటంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. తన పాఠశాల నుంచి దూర ప్రాంతాల్లోని ఇతర పాఠశాలలకు వెళ్లి అక్కడ పరీక్షల నిర్వహణను పరిశీలించి తిరిగి తమ పాఠశాలకు చేరుకొని బోధనా విధులు నిర్వహించటంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. మహిళా ఉపాధ్యాయులకు దూర ప్రాంతాలకు వెళ్లి పరీక్షల విధుల నిర్వహించి రావటం అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నదని తెలిపారు. ఇప్పటికే ఉపాధ్యాయులు అనేక బోధనేతర బాధ్యలు, ఎన్నికల విధులు నిర్వహించి తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, ఈ పరిస్థితులలో అబ్జర్వర్ పేరుతో అదనపు భారం మోపటం సరికాదన్నారు. ఉపాధ్యాయులను బోధనా విధులకే పరిమితం చేయాలని కోరారు.


