గుంటూరు లీగల్: విద్యను ఆయుధంగా చేసుకుని, పేదరికాన్ని జయించి, ఉన్నతమైన న్యాయమూర్తి స్థాయికి ఎదిగి, తాజాగా ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందిన గుంటూరు ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ న్యాయమూర్తి దున్నా రాములు ప్రస్థానం ఆదర్శనీయమని పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు ప్రశంసించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కూనవరం అనే మారుమూల గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన దున్నా రాములు తన జీవిత ప్రయాణంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, బాధలను ఎదుర్కొన్నారు. చదువుకోవాలనే బలమైన సంకల్పంతో క్రైస్తవ సంస్థల్లో ఉచిత భోజన సదుపాయాన్ని పొందుతూ విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. ఎన్నో అవరోధాలను అధిగమించి ఉన్నత విద్యను అభ్యసించి నేడు న్యాయమూర్తి స్థాయికి ఎదగడం అసాధారణమైన విజయగాథ. ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించి డబుల్ ఎం.ఏ., డబుల్ ఎల్.ఎల్.ఎం సాధించారు. తాజాగా నవంబర్ 9వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ‘రాజ్యాంగం మరియు విలువలు’ అనే అంశంపై పరిశోధన చేసి పీహెచ్డీ డాక్టరేట్ పట్టా పొందడం ఆయన విద్యా ప్రస్థానంలో మరో చారిత్రాత్మక మైలురాయి. ఈ సందర్భంగా పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, ప్రముఖులు న్యాయమూర్తి దున్నా రాములుకు అభినందనలు తెలియజేశారు.


