● మద్యం మత్తులో డ్రైవర్ వాహనం నడిపినట్లు ఆరోపణలు ● పూర్తిగా తెగిపడిన కాలు ● ప్రజల అప్రమత్తతతో త్రుటిలో తప్పిన మరో ప్రమాదం
కొల్లూరు: ఇసుక లారీ అతి వేగం ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. ద్విచక్ర వాహనదారుడు కాలు పూర్తిగా కోల్పోయిన సంఘంటన బుధవారం మండలంలోని పెసర్లంక అడ్డరోడ్డు సమీపంలో చోటుచేసుకుంది. క్షతగాత్రుడు, స్థానికుల కథనం మేరకు.. ఈపూరులంకకు చెందిన తోట మల్లికార్జునరావు ద్విచక్ర వాహనంపై కొల్లూరు వెళుతున్నాడు. గాజుల్లంక ఇసుక డంపింగ్ యార్డు నుంచి కొల్లూరు వైపు ఇసుక రవాణా చేస్తున్న లారీ వెనక నుంచి అతి వేగంగా వచ్చి మల్లికార్జునరావు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం లారీ ముందు చక్రం కింద చిక్కుకు పోవడంతో మల్లికార్జునరావుకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ద్విచక్ర వాహనంతో సహా ఆయనను కొద్ది దూరం లారీ ఈడ్చుకొని వెళ్లడంతో అతని కుడి కాలు చీలమండల పైభాగంలో పూర్తిగా తెగి పడిపోయింది. స్థానికులు ప్రమాదాన్ని గమనించి అప్రమత్తమయ్యే లోపే డ్రైవర్ లారీని సంఘటనా ప్రాంతంలోనే వదిలి పరారయ్యాడు. ప్రమాదంలో కాలు కోల్పోయి తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడికి స్థానికులు సపర్యలు చేశారు. అతని బంధువులకు సమాచారం అందించారు. అనంతరం చికిత్స నిమిత్తం తెగిపడిన కాలితోపాటు, క్షతగాత్రుడిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కొల్లూరులో అందుబాటులో ఉండాల్చిన 108 వాహనం మరో కేసులో అదే సమయంలో బయటకు వెళ్లడంతో, వేమూరు నుంచి మరో 108 వాహనం సంఘటనా ప్రాంతానికి చేరుకోవడానికి ఆలస్యం అవ్వడంతో ఘటనా స్థలిలో క్షతగాత్రుడు పడిన బాధ వర్ణనాతీతంగా మారింది.
త్రుటిలో తప్పించుకున్న మరికొందరు
మరి కొందరు ప్రమాదం బారిన పడకుండా త్రుటిలో తప్పించుకున్నారు. ఇసుక లోడ్‌తో గాజుల్లంక వైపు నుంచి వస్తున్న లారీ ఆవులవారిపాలెం రామాలయం సమీపంలో అతివేగంగా దూసుకు వచ్చింది.
ప్రమాదకరమైన మలుపులున్న ప్రాంతంలో సైతం డ్రైవర్ లారీ వేగం ఏమాత్రం తగ్గించకుండా వస్తుండటం గమనించిన ఆ ప్రాంతంలో ఉన్న స్థానికులు పక్కకు తొలగి ప్రమాదం బారిన పడకుండా తప్పించుకోగలిగారు. భట్టిప్రోలు మండలం వెల్లటూరు వ్యక్తికి చెందిన లారీ డ్రైవర్ అతిగా మద్యం సేవించి లారీ నడపడం కారణంగానే ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక రవాణా చేస్తున్న వాహనాలు నిత్యం మితిమీరిన వేగంతో ప్రయాణిస్తుండటంతో రోడ్లపై రాకపోకలు సాగించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్చి వస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


