భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తం గంటకు 120 కి.మీ.కుపైగా వేగంతో ఈదురుగాలులు విరిగిపడిన భారీ వృక్షాలు, స్తంభాలు నిలిచిపోయిన పలు రైళ్లు
వర్షపాతం వివరాలు ఇవీ...
బాపట్ల: మురసు తుఫాన్ బీభత్సం సృష్టించింది. బాపట్ల జిల్లాను వణికించింది. గంటకు 120 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చెరువులు, కాలువలు, లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. ఎక్కడ చూసినా కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో చెట్లు విరిగిపడగా, పట్టణ ప్రాంతాల్లో హోర్డింగులు, వీధి దీపాలు నేలకొరిగాయి. విశాఖపట్నం నుంచి చైన్నెకి, చైన్నె నుంచి విశాఖపట్నానికి వెళ్లే రెండు రైళ్లు సోమవారం అర్ధరాత్రి నుంచి బాపట్లలో నిలిచిపోయాయి. జిల్లాలోని బాపట్ల, చీరాల, చిన్నగంజాం, భట్టిప్రోలు, రేపల్లె, కొల్లూరు, కర్లపాలెం, పిట్టలవానిపాలెం, వేటపాలెం ప్రాంతాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది.
తీరంలో కకావికలం
సముద్ర తీరం కకావికలమైంది. ఈదురుగాలులు బలంగా వీయడంతోపాటు చిమ్మచీకట్లు కమ్ముకుని తీరం వద్ద భయానక వాతావరణం కనిపించింది. సూర్యలంక సముద్ర తీరానికి వెళ్లే దారిలో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద ఉన్న కాలువ పొంగిపొర్లింది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. సూర్యలంక రోడ్డులో డివైడర్‌కు ఉన్న లైటు విరిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలోని వరి, అరటి, పసుపు, వేరుశనగ పంటలు నీట మునిగాయి. పంట పొలాలు చెరువులను తలపించే విధంగా ఉన్నాయి. జిల్లాలోని 70 లోతట్టు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సూర్యలంక, అడవిపల్లిపాలెం, కృపానగర్, ఓడరేవు, తుమ్మలపల్లి, పెద్దగొల్లపాలెం ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాపట్ల రైల్వే స్టేషన్ వద్ద రెండు రైళ్లు సోమవారం అర్ధరాత్రి నుంచి నిలిచిపోవడంతో ప్రయాణికులకు సాయం అందించేందుకు రెడ్‌క్రాస్ సంస్థ ముందుకొచ్చింది. బి.ఎస్. నారాయణభట్టు, రమణమూర్తిల ఆధ్వర్యంలో రైల్వే ప్రయాణికులకు అల్పాహారం, బిస్కెట్లు, పాలు పంపిణీ చేశారు. జిల్లాలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు.
నీట మునిగిన పంటలు
కొల్లూరు : వర్షంతో పంట పొలాలు ముంపు బారిన పడ్డాయి. కొల్లూరు మండలంలో సాగు చేసిన వరి నేల వాలింది. లంక గ్రామాలలో మినప పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పసుపు పంటలో భారీగా వర్షపు నీరు చేరింది.. కొల్లూరులో భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అధ్వానంగా మారిన డ్రైనేజ్ వ్యవస్థ కారణంగా పలు చోట్ల గృహాలలోకి నీరు చేరింది. రేపల్లె – తెనాలి రోడ్డుపై భారీగా నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం వాటిల్లింది.
పునరావాస కేంద్రాల పరిశీలన
బాపట్ల: పునరావాస ప్రాంతాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ పరిశీలించారు. రామ్‌నగర్ ప్రాథమిక పాఠశాల, కొండుబొట్లవారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో ఉన్న వారితో ఆయన మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్ ఎం.హాసిని, ఆర్ అండ్ బీ డీఈ అరుణ, తహసీల్దార్ షేక్ సలీమా, వీఆర్‌ఓలు తదితరులు ఉన్నారు.
జిల్లాలోని టి.చుండూరులో 109.8, అమృతలూరు 119.7, వేమూరు 110.6, కొల్లూరు 108.4, భట్టిప్రోలు 103.5, చెరుకుపల్లి 129.8, పిట్టలవానిపాలెం 112.2, కర్లపాలెం 213.4, బాపట్ల 253, నిజాంపట్నం 49.8, నగరం 88.2, రేపల్లె 96.4, మార్టూరు 333.2, యద్దనపూడి 267.4, పర్చూరు 202.4, కారంచేడు 183.6, ఇంకొల్లు 199, చీరాల 225, వేటపాలెం 175.4, చిన్నగంజాం 174.4 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.


