చీరాల టౌన్: మురసు తుఫాన్ నేపథ్యంలో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులతో చీరాల పట్టణం అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ప్రజా రవాణా నిలిచిపోయింది. సోమవారం అర్ధరాత్రి నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. వాడరేవులో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలల ఉధృతి పెరిగి భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఉవ్వెత్తున అలలు ఎగసిపడటంతోపాటు కొన్ని చోట్ల తీరం కోతకు గురైంది. వాడరేవులో తహసీల్దార్ గోపీకృష్ణ, వీఆర్వో శేఖర్, పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేయడంతోపాటు మత్స్యకారుల వేట సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పోలీసు పికెట్లు ఏర్పాటుతో తీరం బోసిపోయింది.
20 పునరావాస కేంద్రాలు....
కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశాల మేరకు చీరాల మండలంలో 20 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. తీరప్రాంత గ్రామాలతోపాటు శివారు కాలనీలు, గ్రామాల్లో నివసించే 600 మందిని ఈ కేంద్రాల్లో సురక్షితంగా ఉంచారు. పలు గ్రామాల్లో స్ట్రయిట్‌కట్‌పై, శివారు ప్రాంతాల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న యానాదులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. చీరాల మండలంలోని ఈపురుపాలెం శేఖరపుట్ట సమీపంలో స్ట్రయిట్‌కట్ కాలువపై గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న యానాదులను జెడ్పీ హైస్కూల్ పునరావాస కేంద్రానికి తరలించారు.
ఆచూకీ లేని ఐదుగురు మత్స్యకారులు
వేటకు వెళ్లిన వాడరేవు గ్రామానికి చెందిన వై.రమణ, ఎస్.పోలారావు, టి.అప్పారావు, ఎం.జగన్నాథం, జి.కొందాడ ఆదివారం రాత్రి సముద్రంలో వేటకు వెళ్లారు. సోమవారం రాత్రి కూడా ఇంటికి చేరలేదు.
ఉధృతంగా కాలువ
ప్రధాన రహదారులతోపాటు కాలనీల్లోని రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. వాడరేవు ప్రధాన రహదారి మొత్తం చెరువును తలపిస్తోంది. రోడ్లపై సుమారు రెండు అడుగుల మేర నీరు నిలిచిపోయాయి. మండలంలోని ఈపురుపాలెం స్ట్రయిట్‌కట్ కాలువ వర్షపు నీటి ప్రవాహంతో నిండుకుండలా మారింది. పర్చూరు నియోజకవర్గం నుంచి వచ్చే వర్షపు నీరు స్ట్రయిట్‌కట్ కాలువ ద్వారా వాడరేవులోని దానవాయిపేట వద్ద సముద్రంలో కలుస్తుంది. ఎగువ ప్రాంతం నుంచి వరద రావడంతో నీటిమట్టం పెరిగిపోయింది.
వాడరేవులో ఆచూకీ లేని ఐదుగురు మత్య్సకారులు


