బరితెగిస్తున్న టీడీపీ నాయకులు ఇతర పార్టీల అభ్యర్థులకు హెచ్చరికలు
కొల్లూరు: పచ్చ పార్టీ నేతల ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతికూల పవనాలు వీస్తుండటంతో బెదిరింపులు, ప్రలోభాలకు తెర తీశారు. వేమూరు నియోజకవర్గంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ అభ్యర్థులతోపాటు, స్వతంత్ర అభ్యర్థులను కూడా బెదిరిస్తున్నారు. సొంత పార్టీలోని అసంతృప్తిపరులను కూడా అంతు చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు. అప్పటికీ ఓటమి భయం వీడని టీడీపీ నాయకులు... ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాల మంత్రం పఠిస్తున్నారు. వివిధ సామాజిక వర్గాల ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టాలన్న లక్ష్యంతో హామీలు గుప్పిస్తున్నారు. చర్చిల నిర్మాణాలు చేయిస్తామని, ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని, కమ్యూనిటీ భవనాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని ప్రలోభాల వల విసురుతున్నారు.
అభ్యర్థులే లక్ష్యంగా...
స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ టీడీపీ నాయకుల వ్యవహారం శ్రుతి మించుతోంది. కొల్లూరు మండలంలో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకొని, వారిని భయపెట్టి, బెదిరించి ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వకుండా చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ నాయకుల హెచ్చరికలను పట్టించుకోని అభ్యర్థులపై ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఫోన్లు చేయించి వేధిస్తున్నారు. దేవస్థాన భూముల కౌలు బకాయిలను చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. వీటికి తోడు కొల్లూరు–3 టీడీపీ ఎంపీపీ అభ్యర్థిపై పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థికి సైతం పలు బెదిరింపులు ఎదురవుతున్నట్లు సమాచారం. మరోవైపు టీడీపీలోని అసంతృప్తిపరులను సైతం ‘‘ అంతు చూస్తాం.. ప్రాణాలు తీస్తాం’’ అంటూ టీడీపీ ఎంపీపీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న వ్యక్తి సోదరుడు ఫోన్లో బెదిరించారని తెలిసింది. ఈ వ్యవహారం పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కింది.
ప్రలోభాల ఎర..
పరిషత్ ఎన్నికల్లో ఓటమి నుంచి తప్పించుకునేందుకు టీడీపీ నాయకులు ఓటర్లకు ప్రలోభాల ఎర వేస్తున్నారు. వారికి పంపిణీ చేసేందుకు నగదు, మద్యం, చీరలను పెద్ద ఎత్తున సమకూర్చుకున్నట్లు సమాచారం. దీనికి తోడు ఎస్సీ, ఎస్టీ, కాపు సామాజిక వర్గాల ఓట్లను కొల్లగొట్టాలన్న ధ్యేయంతో ఆయా సామాజిక వర్గాలను ప్రభావితం చేసేలా అడ్డగోలు హామీలు ఇస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గం ఓట్ల కోసం కొల్లూరు–3 ఎంపీటీసీ స్థానంలో చర్చి స్లాబ్ నిర్మాణం చేయిస్తామని, చినపులివర్రు ఎంపీటీసీ సెగ్మెంట్లోని రావికంపాడులో షెడ్యూల్డ్ తెగల ఓట్లు రాబట్టుకునేందుకు ఎకరాలకు ఎకరాలు భూమి కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు ఇస్తామని, కాపు సామాజిక వర్గాల ఓట్ల కోసం కమ్యూనిటీ భవనాలకు నిధులు కేటాయిస్తామని మభ్యపెడుతున్నారు. ఇందుకు తగ్గట్టుగా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేరుతో పెసర్లంక, సుగ్గునలంక గ్రామాల్లో కమ్యూనిటీ భవనాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు ఓ పత్రాన్ని ప్రదర్శిస్తూ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పచ్చ పార్టీ నాయకుల ప్రలోభాల ప్రయత్నాలను గమనిస్తున్న ఓటర్లు మాత్రం ఇప్పటి వరకు ఇచ్చిన హామీల అమలు సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు ముగిసినా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టని చంద్రబాబు ప్రభుత్వం... ఇప్పుడు ఎన్నికలు రాగానే మోసపూరిత మాటలు చెప్పి ఓట్లు దండుకోవాలనుకోవడం తగదని పలువురు హితవు పలుకుతున్నారు.


