భవితవ్యానికి కౌంట్‌డౌన్‌! | - | Sakshi
Sakshi News home page

భవితవ్యానికి కౌంట్‌డౌన్‌!

Nov 3 2026 1:51 AM | Updated on Nov 3 2026 1:51 AM

భవితవ్యానికి కౌంట్‌డౌన్‌!

బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైన ఓటర్ల తీర్పు.. మరికొద్ది గంటల్లో వెల్లడి రేపల్లెలో మున్సిపల్‌ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం ఏబీఆర్‌ డిగ్రీ కళాశాలలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కౌన్సిలర్‌ అభ్యర్థుల కోసం 18 కౌంటింగ్‌ టేబుళ్లు చైర్‌పర్సన్‌ ఓట్ల లెక్కింపునకు ప్రత్యేకంగా తొమ్మిది టేబుళ్లు ప్రతి అర్ధగంటకోసారి ఫలితాలు వెల్లడి

అర్ధగంటకోసారి ఫలితం వెల్లడి

రేపల్లె: ఇన్నాళ్లూ సాగిన ప్రచార హోరు.. రాజకీయ నాయకుల వ్యూహాలు.. అభ్యర్థుల ఎత్తుగడలు.. ఓటర్లను ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు.. వీటన్నింటికీ నేడు తెరపడనుంది. ఓటరు మహాశయులు ఇచ్చిన తీర్పు ఏమిటో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. గెలుపు మాదంటే మాదంటూ ధీమా వ్యక్తం చేస్తున్న అభ్యర్థులకు అసలు పరీక్ష ఎదురుకానుంది. బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైన ఓట్ల రూపంలో అభ్యర్థుల రాజకీయ భవితవ్యం బయటపడనుంది. రేపల్లె మున్సిపాలిటీ పీఠం ఎవరిని వరిస్తుంది? ఏ పార్టీకి ఓటర్లు అండగా నిలిచారు? ఎవరికి విజయాన్ని కట్టబెట్టారు? అన్న ప్రశ్నలకు నేడు సమాధానం లభించనుంది.

ఉత్కంఠకు తెరదించనున్న కౌంటింగ్‌

రేపల్లె మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబర్‌ 3వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటలకు పట్టణంలోని ఏబీఆర్‌ డిగ్రీ కళాశాలలో ప్రారంభం కా నుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్‌ ప్రక్రియను పారదర్శకంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన సిబ్బందిని, టేబుళ్లను సిద్ధం చేశారు. ఉదయం 8 గంటలకు మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించనున్నారు. అనంతరం బ్యాలెట్‌ బాక్సుల్లోని ఓట్లను బయటకు తీసి 50 ఓట్ల చొప్పున కట్టలుగా విభజించి లెక్కింపు చేపట్టనున్నారు.

18 టేబుళ్ల ఏర్పాటు..

ఓట్ల లెక్కింపు ప్రక్రియను వేగవంతంగా, సజావుగా నిర్వహించేందుకు అధికారులు మొత్తం 18 టేబుళ్లను ఏర్పాటు చేశారు. తొలుత వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థులకు సంబంధించిన ఓట్లు, చైర్‌పర్సన్‌ అభ్యర్థులకు సంబంధించిన ఓట్లను వేర్వేరుగా విభజించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం 18 టేబుళ్లలో తొమ్మిది టేబుళ్లపై వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థుల ఓట్లను, మిగిలిన తొమ్మిది టేబుళ్లపై చైర్‌పర్సన్‌ అభ్యర్థుల ఓట్లను లెక్కించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

35 వార్డుల్లో పోరు..

రేపల్లె మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉండగా 35వ వార్డు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 35 వార్డులకు ఎన్నికలు జరిగాయి. పట్టణంలో మొత్తం 37,008 మంది ఓటర్లు ఉండగా 25,564 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఓటర్లు ఏ పార్టీకి ఎంతమేర మద్దతు ఇచ్చారన్నది నేడు వెల్లడికానుంది.

చైర్‌పర్సన్‌ పీఠంపై అందరి చూపు

కౌన్సిలర్‌ స్థానాల ఫలితాలతో పాటు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక ఫలితాలపైనా అందరి దృష్టి నెలకొంది. మున్సిపల్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు చేసిన ప్రయత్నాలు ఎంతవరకు ఫలించాయో నేడు తేలనుంది. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలు స్థానిక రాజకీయ సమీకరణాలు అభ్యర్థుల వ్యక్తిగత బలాబలాలు ఓటర్ల తీర్పుపై ఎలాంటి ప్రభావం చూపాయన్నది ఫలితాలతో స్పష్టం కానుంది. ఇన్నాళ్లూ గెలుపు కోసం పరుగులు పెట్టిన అభ్యర్థులకు నేడు ఫలితాల రూపంలో అసలు తీర్పు ఎదురుకానుంది. కొందరి రాజకీయ ప్రస్థానానికి కొత్త ఊపిరి అందనుండగా మరికొందరికి ఎదురుదెబ్బ తప్పకపోవచ్చు. మొత్తంగా రేపల్లె మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ పట్టణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారనుంది.

ఏబీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు సిద్ధమైన కేంద్రం

ఉదయం 10 గంటల నుంచి వార్డుల వారీగా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రతి అరగంటకు ఒకసారి ఫలితాలను ప్రకటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో కౌంటింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే తొలి ఫలితాలు వెలువడనున్నాయి. ఒక్కో వార్డు ఫలితం ప్రకటించే కొద్ది రాజకీయ పార్టీల శిబిరాల్లో ఉత్సాహం, ఆందోళన కనిపించనుంది. ఆధిక్యంలో ఉన్న అభ్యర్థుల శిబిరాల్లో సంబరాలు మొదలైతే వెనుకబడిన అభ్యర్థుల శిబిరాల్లో ఉత్కంఠ నెలకొననుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement