స్ట్రాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతర నిఘా
మొత్తం 369 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు
విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదు.
జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్
బాపట్ల బాపట్ల జిల్లాలోని చీరాల, రేపల్లె మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత కల్పించడంతోపాటు, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిరంతర పోలీస్ నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. చీరాల, రేపల్లె పట్టణాల్లోని ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మొత్తం 369 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో ఇద్దరు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 21 మంది ఎస్‌ఐలు విధులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా విధులను సమర్థవంతంగా నిర్వహించేలా పోలీస్ సిబ్బందికి అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల వద్ద నిరంతర భద్రత కొనసాగించాలని, విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అనుమతి కలిగిన అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లను మాత్రమే అనుమతించాలని, గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే లోపలికి అనుమతించాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు, ఇతర నిషేధిత వస్తువులను తీసుకురాకూడదని స్పష్టం చేశారు. కౌంటింగ్ ఏజెంట్లు తమకు కేటాయించిన స్థానాల్లోనే ఉండాలని, ఎన్నికల అధికారులు జారీ చేసే సూచనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అనవసరంగా గుమిగూడడం, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రస్తుతం జిల్లాలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ తో పాటు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించేందుకు ఎలాంటి అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తయ్యేందుకు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని, ఎన్నికల నిబంధనలు, చట్టాలను గౌరవిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు.


