నాలుగు రోజుల్లో 198 మి.మీ వర్షం కురిసే అవకాశం నేడు విద్యాసంస్థలు, పరిశ్రమలకు సెలవులు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
బాపట్ల: మురసు తుఫాన్‌తో బాపట్ల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తుఫాన్ ప్రభావంతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. నెల్లూరు–ప్రకాశం జిల్లాల మధ్య రాత్రి తీరం దాటే అవకాశం ఉందన్నారు. తీరం దాటే సమయంలో ఒక్కరోజులోనే 40 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుందన్నారు. ఈ ప్రభావం నాలుగు రోజులపాటు బాపట్ల జిల్లాపై ఉంటుందని, జిల్లా అంతట 198 మిల్లీమీటర్ల వర్షం కరుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించిందన్నారు. వర్షం నీరు పంట పొలాలలో నిల్వ లేకుండా ఒకరికొకరు రైతులు సహకరించుకోవాలి కలెక్టర్ సూచించారు. పంటలు, రైతులకు నష్టం జరగకుండా చూడాలన్నారు. అతి భారీ వర్షాల హెచ్చరికలతో విద్యాసంస్థలు, ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలన్నింటికి సెలవు ప్రకటించినట్లు తెలిపారు. తుఫాన్ సమయంలో ప్రజలు, జీవాలకు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండాలంటే ఎవరు బయటకు రావద్దన్నారు. జీవాలను భద్రం చేసుకోవాలన్నారు. మత్స్యకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లారాదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. నల్లమడ కాల్వల వెంట ఏడు నివాస ప్రాంతాలను గుర్తించి, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు.
విద్యుత్ సమస్యలు రాకుండా చర్యలు
మురసు తుపాను నష్టాన్ని ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా సిద్ధమయ్యామని కలెక్టర్ చెప్పారు. విద్యుత్ స్తంభాలు కూలితే తక్షణమే పునరుద్ధరించడానికి 4,200 స్తంభాలను సిద్ధంగా ఉంచామన్నారు. 250 మంది విద్యుత్ శాఖ కార్మికులను సిద్ధం చేశామన్నారు. 106 విద్యుత్ పరివర్తకాలను సిద్ధంగా ఉంచామన్నారు. ఔషధాల దుకాణాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు.
ఓట్ల లెక్కింపునకు పటిష్ట చర్యలు
చీరాల, రేపల్లె మున్సిపాలిటీలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమర్ధంగా నిర్వహించడానికి పట్టిష్టమైన చర్యలు తీసుకున్నామని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ చెప్పారు. చీరాల మున్సిపాలిటీకి చెందినవి చీరాల ఇంజినీరింగ్ కళాశాలలో, రేపల్లె మున్సిపాలిటీకి చెందినవి రేపల్లె ఏబీఆర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలలో లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభమవుతుందన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలవుతుందన్నారు.


