ఓటమి భయంతో ‘పచ్చ’ కుట్రలు | - | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతో ‘పచ్చ’ కుట్రలు

Oct 30 2026 2:15 AM | Updated on Oct 30 2026 2:15 AM

ఓటమి భయంతో ‘పచ్చ’ కుట్రలు

● ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీకి ఏజెంట్లు

లేకుండా టీడీపీ ప్రయత్నాలు

● మాచర్ల మున్సిపల్‌ కమిషనర్‌

వేణుబాబు నేతృత్వంలో ప్రణాళిక

● వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులపై

టీడీపీ గూండాల దాడి

● ఏజెంట్ల ఫారాలు బలవంతంగా

లాక్కుని చించివేత

● ఓటమి భయంతోనే కుట్రలు

చేస్తున్నారని పిన్నెల్లి ఆగ్రహం

సాక్షి ప్రతినిధి, గుంటూరు/మాచర్ల: వైఎస్సార్‌ సీపీని ఎన్నికల్లో నేరుగా ఎదుర్కోలేక అధికారం అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచి నామినేషన్లు దాఖలు చేసేవారిని అడ్డుకోవడం, పోలీసులను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడడం, బీ ఫారాలు సమర్పించనీయకుండా లాక్కొని చించివేయడం వంటి దుశ్చర్యలకు తెగబడుతూనే ఉన్నారు. ఈ కుట్రలన్నింటినీ తట్టుకుంటూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవితోపాటు 36 వార్డులకు అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలనే దుర్మార్గపు ఆలోచనలతో అడుగడుగునా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు, నాయకులపై దాడులకు తెగబడుతున్నారు.

పక్కా ప్రణాళిక ప్రకారమే...

తాజాగా గురువారం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఎన్నికల అధికారులే నేరుగా ఉదయం నుంచే ఫోన్లు చేసి, ఏజెంట్ల ఫారాలు సమర్పించేందుకు నేడే చివరి రోజని, వెంటనే సమర్పించాలని హడావుడి చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ ధూళిపాళ్ల వేణుబాబు నేతృత్వంలో ఈ కుట్రకు తెరతీశారు. ఆయనే స్వయంగా అధికారులను పురమాయించి, వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు ఫోన్లు చేయించారు. నామినేషన్‌ పత్రాలను ఐదు గంటల్లోపు సమర్పించాలని, లేదంటే ఏజెంట్లు లేకుండా పోతారని బెదిరింపులకు పాల్పడ్డారు. కమిషనర్‌ వేణుబాబుతోపాటు ఎన్నికల అధికారులందరూ ఈ కుట్రలో పాలుపంచుకున్నారు. 200 మంది టీడీపీ గూండాలను తన చాంబర్‌ వద్ద మోహరింపజేసి, ఆ తర్వాత పథకం ప్రకారం వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను పిలిపించారు. వారు ఏజెంట్ల ఫారాలతో మున్సిపాలిటీ కార్యాలయంలోకి రాగానే సినిమా ఫక్కీలో గేట్లు మూసివేయించి, సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారు. దీంతో అప్పటికే రాడ్లు, కర్రలతో సిద్ధంగా ఉన్న టీడీపీ గూండాలు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులపై దాడి చేసి, వారి చేతుల్లో ఉన్న ఏజెంట్ల ఫారాలను బలవంతంగా లాక్కొని చించివేశారు. క్షణాల్లో జరిగిన ఈ ఘటనతో నివ్వెరపోయిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు తేరుకునేలోపే అంతా ముగిసిపోయింది.

మొదటి నుంచీ అంతే...

మున్సిపల్‌ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కమిషనర్‌ వేణుబాబుతోపాటు పోలీసు ఉన్నతాధికారులు, మాచర్ల నియోజకవర్గంలోని పోలీసులందరూ ఏకమై అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ, వారు చెప్పిందల్లా చేస్తూ వచ్చారు. ఇందులో భాగంగా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు చైర్‌పర్సన్‌ పదవితోపాటు 36 వార్డులకు నామినేషన్లు వేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. టీడీపీ నేతల ఆదేశాలతో అటు పోలీసులు, ఇటు ఎన్నికల అధికారులు కుమ్మక్కయ్యారు. బీ ఫారాలు అందించేందుకు వచ్చిన సమయంలోనూ ఇదే విధంగా కర్రలు, రాడ్లతో అప్పటికే అక్కడ మోహరించిన టీడీపీ గూండాలు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులపై దాడులకు తెగబడి, బీ ఫారాలను లాక్కొని చించివేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసినా, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చైర్‌పర్సన్‌ అభ్యర్థితోపాటు 33 వార్డులకు వైఎస్సార్‌సీపీ గుర్తు లేకుండా పోయింది. అయినప్పటికీ పట్టుదలతో బీరువా గుర్తుతో ధైర్యంగా ప్రచారం చేసి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదనే భయం టీడీపీ నేతలను వెంటాడుతూనే ఉంది. గుర్తు లేకపోయినా వైఎస్సార్‌సీపీని ఆపలేమని గ్రహించిన అల్లర్లు సృష్టించేందుకు ప్రణాళిక రూపొందించారు. వైఎస్సార్‌ సీపీ తరఫున స్వతంత్ర అభ్యర్థులుగా బీరువా గుర్తుపై పోటీ చేస్తున్న 5, 6, 7, 30, 34 వార్డులతోపాటు మరో ముగ్గురు అభ్యర్థులను ఏజెంట్ల ఫారాల సెట్లు తీసుకుని రావాలంటూ ఫోన్లు చేసి మరీ పిలిపించారు. వారు లోపలికి రాగానే ఫారాలను లాక్కుని టీడీపీ గూండాలు చించివేశారు. విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు పోలా శ్రీనుపై సైతం దాడికి యత్నించారు. ఎన్నికలు సజావుగా జరగకుండా వైఎస్సార్‌సీపీ తరఫున ఏజెంట్లు లేకుండా చేయాలనేది మొదటి కుట్ర. అయితే, ఎన్నికల అధికారులు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఫోన్లు చేసిన సమయంలో వారు తమ ఫోన్లలో సంభాషణలను రికార్డు చేయడంతో భయపడిన అధికారులు, రేపు మళ్లీ బీ ఫారాలతో రావాలంటూ కొత్త రాగం అందుకున్నారు. టీడీపీ గూండాలను తమ చాంబర్‌ వద్దే ఉంచుకుని, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను మాత్రం ఒక్కొక్కరినే రావాలంటూ అటు ఎన్నికల అధికారులు, ఇటు పోలీసు అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. ఈ విధంగా కుట్రలను అధికారికంగా అమలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement