గుంటూరు మెడికల్: అపరిశుభ్రమైన వాతావరణంలో పురుగు పట్టిన బియ్యంతో వంట చేస్తున్న హాస్టల్‌ను సోమవారం అధికారులు సీజ్ చేశారు. గుంటూరు బ్రాడీపేట 4/12లోని మమతా లగ్జరీయస్ బోయ్స్ హాస్టల్‌పై అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈనేపథ్యంలో సివిల్ సప్లయి అధికారులు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఫుడ్ విజిలెన్స్ కమిటీ మూకుమ్మడిగా తనిఖీ చేశారు. హాస్టల్లో కిచెన్ అపరిశుభ్రమైన వాతావరణంలో ఉండటాన్ని గమనించారు. రోడ్డుపైనే వంట చేయడం, వాష్ ప్రాంతం, వంట గది, సరుకులు నిల్వ చేసే స్టోర్ అన్ని ఒకే ప్రాంతంలో ఉండటం గుర్తించారు. పేదలకు ఉచితంగా పంపిణీ చేసే చౌక ధర దుకాణంలో లభించే స్టోర్ బియ్యం రెండు క్వింటాళ్లు హాస్టల్లో ఉండటం గుర్తించారు. సదరు బియ్యం పురుగు పట్టి ఉండటం గమనించారు. ఆహార పదార్థాలన్నీ నిషేధిత రంగులతో వండి, విద్యార్థులకు వడ్డించడాన్ని గుర్తించి తక్షణమే హాస్టల్‌ను సీజ్ చేశారు. శానిటేషన్ శుభ్రంగా లేకపోవడంపై నోటీసులు జారీచేసినట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నూతలపాటి పూర్ణచంద్రరావు తెలిపారు. సివిల్ సప్లయి అధికారులు రెండు క్వింటాళ్ల స్టోర్ బియ్యాన్ని, రెండు సిలిండర్లు సీజ్ చేసి కేసు నమోదు చేశారన్నారు. మమత లగ్జీరీస్ బోయ్స్ హాస్టల్ నిర్వాహకుడు రాయప్ప, ఫుడ్ కంట్రోలర్ అనుమతి లేకుండా హాస్టల్ నిర్వహిస్తుండటంతో కేసు నమోదు చేశామన్నారు. లైసెన్సు లేకుండా మెస్ నిర్వహిస్తే రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.


