కొరిటెపాడు(గుంటూరు): జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 15 మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడింది. అత్యధికంగా వట్టిచెరుకూరు మండలంలో 24.6 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా మంగళగిరి మండలంలో ఒక మి.మీ. వర్షం పడింది. సగటున 7.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. ప్రత్తిపాడు మండలంలో 20.4 మి.మీ., దుగ్గిరాల 16.6, గుంటూరు తూర్పు 16.2, చేబ్రోలు 13, పెదనందిపాడు 9.2, తెనాలి 7.8, కాకుమాను 6.8, తాడికొండ 4.8, పెదకాకాని 4, కొల్లిపర 3.6, తాడేపల్లి 1.6, గుంటూరు పశ్చిమ 1.3, తుళ్ళూరు మండలంలో 1.2 మి.మీ. చొప్పున వర్షం పడింది. అక్టోబర్ 24వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 100.2 మి.మీ. పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 31.2 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది.
చేబ్రోలు: సైబర్ నేరస్తులు రోజురోజుకు కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా చేబ్రోలు మండలం నారాకోడూరుకు చెందిన ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని నమ్మించి రూ.10 లక్షలు దోచుకున్న ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని నారాకోడూరు గ్రామానికి చెందిన వెలక శంకరరావు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. రెండు రోజుల క్రితం ఆయనకు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. తాము బెంగళూరు పోలీసులుగా పరిచయం చేసుకుని ‘మీ అకౌంట్’లో పొరపాటున రూ.70 లక్షల నగదు జమ అయ్యాయని, ఇవి నేరస్తులకు చెందిన డబ్బులు అని దీనిని వెంటనే సరిచేయకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని బెదిరించారు. దీన్ని సరిచేయడానికి మేము చెప్పే అకౌంట్ నంబర్‌కు రూ.10 లక్షలు జమ చేయాలి’ అని బెదిరింపులకు దిగారు. పోలీసులమనే భయంతో పాటు, ఆ డబ్బును సురక్షితంగా కాపాడుకోవచ్చనే ఉద్దేశంతో శంకరరావు ఆ కేటుగాళ్లు మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాకు రూ.10 లక్షలు బదిలీ చేశారు. ఆ తర్వాత వారి నంబర్లకు ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ రావడంతో తాను మోసపోయినట్లు నిర్ధారించుకున్నాడు. చేబ్రోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై చేబ్రోలు ఎస్ఐ పి.వీరనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:
గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ వస్తే ఎవరూ భయపడకూడదని, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పకూడదని ఎస్ఐ వీరనారాయణ సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి మోసపూరిత కాల్స్‌ను నమ్మి కష్టపడి సంపాదించుకున్న డబ్బును పోగొట్టుకోవద్దని ఆయన సూచించారు.
చీరాల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీరాల మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్ధిని డాక్టర్ ఇస్తర్ల షెర్లి కారు అద్దాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. శుక్రవారం రాత్రి చీరాల ఉడ్నగర్లో ఇంటి వద్ద పార్కింగ్ చేశారు. ఉదయం చూసే సరికి కారు అద్దం ధ్వంసం చేసి ఉండడాన్ని గమనించారు. ఇది ఆకతాయిల పని కాదని, ఎవరో ఉద్దేశ పూర్వకంగానే చేసి ఉంటారని భావిస్తున్నట్లు డాక్టర్ ఐ.బాబూరావు తెలిపారు. కారు అద్దాలు అయితే పగలకొట్టారు గాని మనషుల మనస్సును పగలకొట్టలేరన్నారు. తాము ఎవరికీ హాని చేయలేదని, ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకూదని కోరుకుంటున్నట్లు తెలిపారు.


