తెనాలిరూరల్/కొల్లిపర: మండలం తూములూరు గ్రామ శివారులో శుక్రవారం ఇసుక ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. బాపట్ల జిల్లా కొల్లూరు రీచ్ నుంచి కొల్లిపరకు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్ ఓ మోపెడ్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కొల్లిపర మండలం దావులూరుపాలేనికి చెందిన యేమినేని రాఘవమ్మ (70), కొల్లిపర సీహెచ్‌సీలో వైద్యపరీక్షలు చేయించుకునేందుకు అదే గ్రామానికి చెందిన బంధువు అద్దంకి రాజారావు (56)తో కలసి మోపెడ్‌పై వెళుతుండగా ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. కిందపడిపోయిన వారి మీద నుంచి ట్రాక్టర్ దూసుకెళ్లింది. అక్కడికక్కడే మరణించారు. కూలిపనులకు వెళుతుండే రాఘవమ్మ వయోభారంతో ఇంటివద్దే ఉంటుండగా, రాజారావు గ్రామంలో చిన్నచిన్న పనులకు వెళుతుంటారు.
ప్రమాదస్థలంలో ఆందోళన
ప్రమాదం అనంతరం డ్రైవర్ ట్రాక్టర్‌ను ఆపకుండా వెళ్లడంతో స్థానికులు వెంబడించారు. దీంతో అతడు ట్రాక్టర్‌ను ఆపేసి పరారయ్యాడు. అతడికి లైసెన్స్ లేదని తెలిసింది. తమకు న్యాయం చేయాలంటూ మృతుల కుటుంబసభ్యులు, గ్రామస్తులు హనుమాన్‌పాలెం–గుంటూరు రహదారిపై ఆందోళనకు దిగారు. న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కృష్ణానది పరివాహక ప్రాంతమైన కొల్లిపర, కొల్లూరు మండలాల్లో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది. కొల్లిపరలోని రీచ్‌లను నాలుగు నెలల కిందట మూసేశారు. కొల్లూరు రీచ్ నుంచి ఇసుక అక్రమ రవాణా నిరాటంకంగా సాగుతోంది. ఈ అక్రమ రవాణా ఇద్దరి ప్రాణాలు బలిగొంది.
రాఘవమ్మ (ఫైల్)
రాజారావు (ఫైల్)


