అయిందని పింఛన్‌! | - | Sakshi
Sakshi News home page

అయిందని పింఛన్‌!

Oct 2 2026 3:09 AM | Updated on Oct 2 2026 3:09 AM

అయిందని పింఛన్‌! తూతూమంత్రంగా సీఎం పింఛన్ల పంపిణీ సభ మాటలకే పరిమితం!

నిరాశ మిగిల్చిన ముఖ్యమంత్రి పర్యటన

తీర ప్రాంత సమస్యలపై పెదవి విప్పని సీఎం ఎన్నికల హామీ మాదిరిగా త్వరలో రేపల్లెకు వంద పడకల ఆసుపత్రి అంటూ ప్రకటన తీరప్రాంత ప్రజలకు తప్పని నిరాశ జనాలు లేక వెలవెలబోయిన సీఎం రోడ్డు షో.. సీఎం ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయిన మహిళలు

తూతూమంత్రంగా సీఎం పింఛన్ల పంపిణీ సభ
మాటలకే పరిమితం!

రేపల్లె: భారీ అంచనాల మధ్య జరిగిన ముఖ్యమంత్రి పర్యటన చివరకు తీరప్రాంత ప్రజలకు నిరాశనే మిగిల్చింది. మత్స్యకారులు, తీర గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు ఒక్క మాట కూడా ప్రస్తావించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రతి సంవత్సరం తుపానులు, అలల ఉధృతి, జీవన భద్రతపై ఉన్న ఆందోళనల మధ్య జీవిస్తున్న ప్రజలకు స్పష్టమైన భరోసా ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. పర్యటన సందర్భంగా స్థానిక సమస్యలకు ప్రత్యక్ష పరిష్కారాలు ప్రకటిస్తారని ఆశించిన ప్రజలకు ఎన్నికల హామీలా త్వరలో రేపల్లెలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం అనే మాటలకే పరిమితమైంది. ఈ ప్రకటన కూడా గడువు, ప్రణాళిక, నిధుల వివరాలు లేకుండా చెప్పడంతో ప్రజల్లో అనుమానాలు మరింత పెరిగాయి.

సీఎం రోడ్‌ షో వెలవెల...

రేపల్లె పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం ఉదయం 10.55 గంటలకు రేపల్లెకు చేరుకోవాల్సి ఉండగా, సుమారు గంట ఆలస్యంగా 11.48 గంటలకు హెలికాప్టర్‌లో రేపల్లెకు చేరుకున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం పట్టణంలోని 4వ వార్డు మునుసోబువారిపాలెంలో వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే సీఎం పర్యటన ఆలస్యం కావడంతో కార్యక్రమంలో మార్పులు చేశారు. హెలిప్యాడ్‌ నుంచి సీఎం కాన్వాయ్‌లో అయోవా గాల్స్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభకు బయలుదేరారు. అయితే సీఎం కాన్వాయ్‌ వెళ్లిన మార్గంలో పెద్దగా ప్రజలు కనిపించకపోవడంతో రోడ్‌షో వెలవెలబోయింది. అనంతరం ప్రజావేదికలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. సభ ముగిసిన తరువాత నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సాయంత్రం 4వ వార్డులోని మునుసోబువారిపాలెంలో పర్యటించిన సీఎం చంద్రబాబునాయుడు పలువురు వృద్ధులకు పింఛన్లు అందజేశారు. సాయంత్రం 6.02 గంటలకు సీఎం చంద్రబాబునాయుడు తాడేపల్లి బయలుదేరి వెళ్లారు.

తీరప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కొరత మత్స్యకారుల భద్రత, తుపానుల సమయంలో ఆశ్రయ కేంద్రాల లేమి, తాగునీటి సమస్యలు వంటి కీలక అంశాలపై స్పష్టత ఇవ్వకపోవడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు చెప్పుకొనే అవకాశం లేకుండా కార్యక్రమాన్ని త్వరగా ముగించడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల సమస్యలు వినడానికి వచ్చిన పర్యటనా? లేక కేవలం కార్యక్రమం పూర్తి చేసుకోవడానికేనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మాదిరిగానే మరోసారి మాటలకే పరిమితమైన ఈ పర్యటన తీరప్రాంత ప్రజలకు తీవ్ర నిరాశ మిగిల్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సభావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగిస్తున్న సమయంలో సభాప్రాంగణం నుంచి మహిళలు, పార్టీ కార్యకర్తలు వెనుతిరిగి వెళ్లిపోవటం కొసమెరుపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement