రేపల్లె: ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో గురువారం రేపల్లె పట్టణంలో అమలు చేసిన కఠిన ఆంక్షలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించాయి. నగరం – నిజాంపట్నం వైపు నుంచి రేపల్లె పట్టణానికి వచ్చే బస్సులు, ఆటోలను ఇసుకపల్లి సెంటర్ వద్దే నిలిపివేయడంతో ప్రయాణికులు పట్టణానికి చేరుకోవడానికి మూడు కిలోమీటర్లకుపైగా నడవాల్సి వచ్చింది. మండుతున్న ఎండలో చిన్నపిల్లలు, వృద్ధులతో పాటు మహిళలు పడిన ఇబ్బందులు వర్ణణాతీతం. అదేవిధంగా కృష్ణాజిల్లా, భట్టిప్రోలు వైపు నుంచి వచ్చే వాహనాలను ఓల్డ్‌టౌన్ రింగ్ రోడ్ సెంటర్ వద్ద ఆపివేయడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


