తాడేపల్లి రూరల్: వృద్ధాప్యం, అనారోగ్యం బాధపడుతున్న భార్యను పోషించుకోలేక, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకునేందుకు కృష్ణానదిలోకి దూకాడు. తాడేపల్లి ట్రాఫిక్ ఎస్‌ఐ సమయస్ఫూర్తితో కాపాడిన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ట్రాఫిక్ ఎస్‌ఐ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం... కనకదుర్గ వారధి 13వ పిల్లర్ వద్ద ఓ వృద్ధుడు నీటిలోకి దూకాడంటూ ప్రయాణికులు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఎస్‌ఐ సీతానగరంలోని మత్స్యకారులకు ఫోన్‌చేసి ఘటనా స్థలానికి వెళ్లి ప్రాణభయంతో పిల్లర్‌ను పట్టుకుని ఉన్న వృద్ధుడ్ని కాపాడి బయటకు తీసుకువచ్చారు. సదరు వృద్ధుడు మంగళగిరికి చెందిన నాగేశ్వరరావుగా గుర్తించారు. ఇతను గతంలో లారీ డ్రైవర్‌గా పనిచేశాడు. యాక్సిడెంట్‌లో కాలుకి దెబ్బతగలడంతో ఆ వృత్తిని మానుకున్నాడు. భార్య అనారోగ్యంతో ఉండడం, మందులకు డబ్బులు లేక ఇబ్బంది పడుతుండడంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తెలిసింది. పోలీసుల కౌన్సెలింగ్ అనంతరం నాగేశ్వరరావును ఇంటికి పంపించారు. వృద్ధుడిని కాపాడిన ఎస్‌ఐ నారాయణతోపాటు మత్స్యకారులు మల్లి, తన కుమారుడిని ఎస్పీ వకుల్‌జిందాల్ ఫోన్‌లో అభినందించారు.
మత్స్యకారులకు సత్కారం
వృద్ధుడిని రక్షించిన సీతానగరం మత్స్యకారులు సైకం మల్లి, ఆయన కుమారుడు గోపిలను జెవీ సేవాదళ్ ఫౌండర్ వెంకటేష్ శనివారం సత్కరించి, నగదు ప్రోత్సాహాన్ని అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన జాయింట్ సెక్రటరి మహేష్ సేవాదళ్ ప్రతినిధులు సురేష్, సతీష్‌రెడ్డి, మణికుమార్, హర్ష, చరణ్ తదితరులు పాల్గొన్నారు.


