కూటమికి సీట్ల బలం.. వైఎస్సార్ సీపీకి ఓట్ల బలం చీరాలలో సాధారణ ఎన్నికల కంటే స్థానిక సంస్థల్లో వైఎస్సార్ సీపీకి 2.66 శాతం పెరిగిన ఓటింగ్ టీడీపీకి 0.55 శాతం కోత, కాంగ్రెస్‌కు 9.90 శాతం గండి ఓటు బ్యాంకును పదిలం చేసుకున్న వైఎస్సార్ సీపీ
టీడీపీ ఓటింగ్‌లో క్షీణత
‘స్థానిక’ ఎన్నికల్లో పెరిగిన వైఎస్సార్ సీపీ ఓటు బ్యాంకు
చీరాల: ఎన్నికల్లో సీట్ల సంఖ్యే రాజకీయ బలానికి కొలమానం కాదు. ఓటింగ్ శాతమూ అంతే కీలకం. 2024 సాధారణ ఎన్నికలు, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఓటింగ్ గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. సీట్ల సంఖ్యలో మార్పులు చోటుచేసుకున్నప్పటికీ చీరాల నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఓటు బ్యాంకు మాత్రం చెక్కు చెదరలేదు. పైగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని మరింత పెంచుకుని రాజకీయంగా తన పట్టును చాటుకుంది. మరోవైపు కూటమి, కాంగ్రెస్ పార్టీల ఓటింగ్ శాతంలో తగ్గుదల నమోదైంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఓటింగ్ శాతం భారీగా పడిపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.
ఓటింగ్ శాతంలో వైఎస్సార్ సీపీ వృద్ధి
2024 సాధారణ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి 51,716 ఓట్లు రాగా ఓటింగ్ శాతం 30.37శాతం నమోదైంది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో 44,680 ఓట్లు రాగా 33.03కు చేరింది. ఈ రెండు ఎన్నికల మధ్య 2.66 శాతం పెరిగింది. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి సీట్లు సంఖ్య తగ్గినా ఓటింగ్ శాతం పెరగడం ఆ పార్టీకి రాజకీయంగా కీలక పరిణామంగా చెప్పవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకు కొనసాగుతోందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. సాధారణ ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత కూడా వైఎస్సార్ సీపీ తన ఓటర్లను నిలబెట్టుకోవడంలో సఫలమైనట్లు ఓటింగ్ శాతం చెబుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత మంది ఓటర్లు పార్టీ వైపు మొగ్గు చూపడం రాజకీయంగా సానుకూల అంశంగా మారింది. సీట్ల సంఖ్యను మాత్రమే ఆధారంగా చేసుకుని పార్టీ బలాన్ని అంచనా వేయలేమనే వాదనకు ఈ గణాంకాలు బలం చేకూరుస్తున్నాయి.
కాంగ్రెస్ ఓటింగ్‌కు భారీ గండి..
కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ శాతంలో మాత్రం గణనీయంగా తగ్గుదల నమోదైంది. 2024 సాధారణ ఎన్నికల్లో 24.58 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 14.68 శాతానికి పరిమితమైంది. ఏకంగా 9.90 శాతం ఓటింగ్ తగ్గడం ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బగా కనిపిస్తోంది. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లభించిన ఓట్లలో కొంత భాగం స్థానిక ఎన్నికల నాటికి తగ్గినట్లుగా గణాంకాలు సూచిస్తున్నాయి. స్థానిక రాజకీయ సమీకరణాలు, అభ్యర్థుల ఎంపిక, పార్టీ సంస్థాగత బలం వంటి అంశాలు ఓటింగ్‌పై ప్రభావం చూపి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతుంది.
సీట్ల లెక్క వేరు..
ఓట్ల లెక్కలు వేరు
ఎన్నికల ఫలితాల్లో సీట్ల సంఖ్యకు, ఓటింగ్ శాతానికి మధ్య వ్యత్యాసం ఉండడం రాజకీయంగా సహజమే. అభ్యర్థుల ఎంపిక, స్థానిక నాయకత్వం, కూటమి సమీకరణాలు, ఎన్నికల పరిస్థితులు వంటి అనేక అంశాలు సీట్ల ఫలితాలను ప్రభావం చేస్తాయి. వైఎస్సార్ సీపీకి సీట్ల సంఖ్య తక్కువగా వచ్చినా ఓటింగ్ శాతం మాత్రం పెరిగింది. మరోవైపు టీడీపీ సీట్ల సంఖ్య పెరిగినా ఓటింగ్ శాతం స్వల్పంగా తగ్గింది. ఈ పరిణామాలు ఎన్నికల ఫలితాలను కేవలం సీట్ల కోణంలో కాకుండా ఓట్ల కోణంలో కూడా విశ్లేషణ అవసరం ఉంది.
భవిష్యత్తు రాజకీయాలకు సంకేతాలు
స్థానిక సంస్థల ఎన్నికల ఓటింగ్ గణాంకాలు భవిష్యత్ రాజకీయాలకు కీలక సంకేతాలుగా మారనున్నాయి. వైఎస్సార్ సీపీ తన ఓటు బ్యాంకును మరింత బలోపేతం చేసుకోవడం ఆ పార్టీకి సానుకూల పరిణామం. టీడీపీ ఓటింగ్ శాతంలో స్వల్ప తగ్గుదల, కాంగ్రెస్ పార్టీ ఓటింగ్‌లో భారీ క్షీణత ఆయా పార్టీలకు రాజకీయంగా ఆత్మపరిశీలన అవసరాన్ని సూచిస్తున్నాయి. మొత్తంగా సీట్ల సంఖ్యలో మార్పులు వచ్చినా వైఎస్సార్ సీపీ ఓటింగ్ శాతం పెరగడం కనిపిస్తోంది. సీట్ల ఆధిక్యం ఒక అంశమైతే ఓటర్ల మద్దతును నిలబెట్టుకోవడం మరో అంశంగా ఉంది. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్థానిక ఎన్నికల ఫలితాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇవి రానున్న ఎన్నికలకు కీలకంగా మారి వైఎస్సార్ సీపీకి సానుకూలంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
2024 సాధారణ ఎన్నికల్లో టీడీపీ 42.72 శాతం ఓట్లు సాధించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42.17 శాతానికి పరిమితమైంది. రెండు ఎన్నికల మధ్య 0.55 శాతం ఓటింగ్ తగ్గింది. సీట్ల సంఖ్య పెరిగినప్పటికీ ఓటింగ్ శాతంలో స్వల్ప క్షీణత చోటుచేసుకోవడం గమనార్హం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా ఎదురైన పరిణామాలు, స్థానిక స్థాయిలో ప్రజల అభిప్రాయాలు ఓటింగ్‌పై ప్రభావం చూపాయా? అనే చర్చకు తావిస్తోంది. అయితే ఓటింగ్ శాతం తగ్గుదలకు ప్రభుత్వ వైఫల్యాలే కారణమని నిర్ధారించాలంటే ఇతర అంశాలను కూడా పరిశీలన చేయాలి. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం డబ్బులను విచ్చలవిడిగా పంపిణీ చేయడం, వైఎస్సార్ సీపీకి చెందిన నేతలను ఓటర్లను తీవ్రంగా భయపెట్టడం.. తదితరాలు జరిగినా టీడీపీ ఓటు శాతం తగ్గడంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.


