తాడికొండ: ఏపీ సీఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డికు రాష్ట్ర గవర్నవర్ అబ్దుల్ నజీర్ గోల్డ్ మెడల్‌ను మంగళవారం అందజేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా రాహుల్ కుమార్‌రెడ్డి మెడల్ అందుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో విధులు నిర్వహించిన సమయంలో రెడ్‌క్రాస్ సేవల విస్తరణ, నిధుల సమీకరణ, జూనియర్, యూత్ రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదులో విశేష కృషి చేసినందుకుగాను, రెడ్‌క్రాస్ సేవల్లో విశేష కృషికి గుర్తింపుగా రాహుల్ కుమార్‌రెడ్డికు ఈ పురస్కారం లభిందించారు. గవర్నర్ గోల్డ్ మెడల్ అందుకున్న రాహుల్‌కుమార్‌రెడ్డికి అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
ఫిట్‌నెస్‌తోనే సమర్థ పోలీసింగ్
మంగళగిరి రూరల్: ఫిట్‌నెస్, క్రీడలను పోలీసు సిబ్బంది వృత్తి జీవితంలో భాగం చేసుకోవాలని డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా సూచించారు. శారీరక దృఢత్వం, మానసిక అప్రమత్తత పోలీసు విధుల్లో కీలకమన్నారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌న్ మైదానంలో మంగళవారం తొలి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026ను ప్రారంభించారు. శాంతి కపోతాలు, బెలూన్లను గాలిలోకి ఎగురవేసి క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని వివిధ పోలీసు రేంజ్‌లు, యూనిట్లకు చెందిన 16 జట్ల నుంచి సుమారు 1,900 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. సెప్టెంబరు 1 నుంచి 4వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జరిగే ఈ క్రీడా పోటీలకు వీఐటీ– ఏపీ విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మైదానాలు వేదికలుగా నిలుస్తున్నాయి. కార్యక్రమంలో పలువురు అదనపు డీజీపీలు మధుసూదన్‌రెడ్డి, ఆకే రవికృష్ణ,, బి.రాజకుమారి, సీహెచ్ శ్రీకాంత్, కేవీ మోహన్‌రావు, డీఐజీలు అన్బురాజన్, అమ్మిరెడ్డి, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు.
ఈ నెల నుంచి నిత్యావసరాలు పంపిణీ
బాపట్ల: ఈ నెల నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి జగన్మోహన్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 3,87,898 మంది కార్డుదారులకుగాను 5016 మెట్రిక్ టన్నుల పోర్టిఫైడ్ బియ్యం, 191 టన్నుల పంచదారను కేటాయించినట్లు తెలిపారు. కార్డుదారులు తమ సమీప చౌకధరల దుకాణంలో సరుకులు తీసుకోవచ్చని తెలిపారు. బాపట్ల జిల్లాలోని 904 చౌక ధరల దుకాణాలను ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో షాపులు తెరిచి ఎలాంటి ఫిర్యాదులు లేకుండా సరుకులు పంపిణీ చేయాలని సూచించారు.
బోనబోయిన కేసులో నిందితుడి అరెస్టు
గుంటూరు రూరల్: తనను ఇన్నర్ రింగ్‌రోడ్డు రెడ్డిపాలేనికి కు చెందిన కొందరు హత్య చేయాలని ప్రయత్నిస్తున్నారని బోనబోయిన శ్రీనివాసరావు యాదవ్ చేసిన ఫిర్యాదు మేరకు నిందితులను నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం నగరంలోని సౌత్ సబ్‌డివిజన్ డీఎస్పీ పూర్ణచంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం బోనబోయిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన నల్లపాడు పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారన్నారు. మరో నిందితుడు కంకర నరేంద్రరెడ్డిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నరేంద్రను కోర్టులో హాజరుపరచగా ఈనెల 11వ తేదీ వరకూ రిమాండ్ విధించినట్లు తెలిపారు. అనంతరం నిందితుడిని నెల్లూరు జైలుకు తరలించామన్నారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన నల్లపాడు పోలీసులను డీఎస్పీ అభినందించారు.
సంతకాలు సేకరించి నిరసన తెలిపిన కాంట్రాక్టు వైద్య సిబ్బంది
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరు జీజీహెచ్‌లో సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట పలువురు వైద్య సిబ్బంది సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టి వినూత్న తరహాలో నిరసన తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఉద్యోగాలు రెగ్యులరయ్యే వరకు నూరు శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలని, కాంట్రాక్టు ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సంతకాల సేకరణ కార్యక్రమంలో స్టాఫ్‌నర్సులు రమాదేవి, రేణుక, భార్గవి, శ్రీలక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్లు చారి, సుధ, రమేష్, సుధాకర్, శివలక్ష్మి, ఖాసీం, ఫార్మాసిస్టులు సుజాత, చంద్రకళ, శ్రీలక్ష్మి, సౌజన్యం, నాగుల్‌మీరా, ఇతర పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.


