బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో అర్జీదారులు అందజేసిన అర్జీలు పరిశీలించి పెండింగ్ లేకుండా పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చుండూరు, భట్టిప్రోలు మండలంలో అర్జీదారులు అందజేసిన సమస్యలను పరిష్కారం చేయకపోవడానికి గల కారణాలను తహసీల్దార్, ఎంపీడీఓలను ప్రశ్నించారు. యద్దనపూడి మండలంలో గత సోమవారం న ఎందుకు అర్జీలను రిజిస్ట్రేషన్ చేయలేదని ప్రశ్నించారు. ప్రతి సోమవారం మండల కార్యాలయాల్లో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌లో వచ్చే సమస్యల అర్జీలను తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌లో ప్రజలు అందజేసే సమస్యలకు సంబంధించి అర్జీదారులతో సంబంధిత అధికారులు మాట్లాడి వారి సమస్యలను పరిష్కారం చేయాలన్నారు. అర్జీదారులతో కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలను పరిశీలించి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని అర్జీదారులకు సూచించారు. గత వారంలో పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారంలో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించిన మెప్మా పీడీ ఆనంద్ సత్యపాల్‌ను జిల్లా కలెక్టర్, ఇన్‌చార్జి ఆర్డీఓ సత్కరించి, అభినందించారు. వచ్చిన ప్రతి అర్జీని నిశితంగా తానే పరిశీలించిన తదుపరి నాణ్యతతో పరిష్కరిస్తున్నామని పీడీ కలెక్టర్‌కు వివరించారు. పరిష్కార మార్గంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం ద్వారా అవార్డు దక్కిందన్నారు. అధికారులు, సిబ్బంది సహకారంతోనే ఇది సాధ్యమైందని పీడీ తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్న, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, డీపీఓ ఎల్.ప్రభాకరరావు, సీపీఓ ఏ.ఎస్.రాజు, డీఆర్డీఏ, డ్వామా, మెప్మా, గృహ నిర్మాణ సంస్థ పీడీలు బి.సింగయ్య, విజయలక్ష్మి, ఆనంద్ సత్య పాల్, వెంకటేశ్వరరావు, డీఈ ఓ.శ్రీనివాస్, మార్క్‌ఫెడ్ డీఎం కరుణశ్రీ, డీసీహెచ్ ఎస్.పద్మావతి, డీటీసీ పరంథామరెడ్డి, జీఎండీఐ సి.రామకృష్ణ, జిల్లా ఖజానా అధికారిణి పద్మావతి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జగన్మోహన్ పాల్గొన్నారు.


