న్యూస్‌రీల్
మండలంలో జోరుగా తవ్వకాలు అడ్డగోలుగా రవాణా చేసి విక్రయాలు మామూళ్ల మత్తులో కన్నెత్తి చూడని అధికారులు అధికారపార్టీ నేత అండదండలే కారణం
బాపట్ల
ఆదివారం శ్రీ 30 శ్రీ ఆగస్టు శ్రీ 2026
బాపట్ల: బాపట్లలోని ఈవీఎం గోదాములను బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ శనివారం పరిశీలించారు. ఆయన వెంట బాపట్ల ఆర్డీఓ, తహసీల్దార్ ఉన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఇసుక దందా నిర్వహిస్తున్న అక్రమార్కులు జేబులు నింపుకొంటున్నారు. అధికార పార్టీ ముఖ్యనేత అండదండలు ఉండటంతో యథేచ్ఛగా ఈ అక్రమం కొనసాగిస్తున్నారు. మామూళ్లతో అధికారులను ప్రసన్నం చేసుకుని వారి సహకారంతో అందినకాడికి ప్రజాధనాన్ని దోచేస్తున్నారు.
చీరాల టౌన్: ఇసుక ధరలు పెరగటంతో దందా చేసేందుకు అధికార పార్టీ ముఖ్యనేత అండగా నిలిచాడు. అతని బృందం, మరికొందరు కొత్తవారు రంగంలోకి దిగారు. స్థానిక పోలీసు, రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులపై కూడా రాజకీయ నాయకుల ఒత్తిళ్లు రావటంతో అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారు. కళ్లముందే ఇసుక తరలిపోతున్నా.. భారీ గోతులు ఏర్పడుతున్నా పట్టించుకోవడం లేదు. అధికారులకు నెలవారీ మామూళ్లు.. ఉద్యోగులకు ఆమ్యామ్యాలు ఇచ్చి పనిని చక్కబెడుతున్నారు. ప్రధానంగా చీరాల మండలంలోని సముద్ర తీర ప్రాంతంతో పాటుగా ఈపూరుపాలెం, విజయనగర్‌కాలనీ, సావరపాలెం, బోయినవారిపాలెం, తోటవారిపాలెం, స్టూవార్టుపురానికి వెళ్లే 216 జాతీయ రహదారి, విజయనగర్‌కాలనీ, పాతచీరాల తదితర ప్రాంతాల్లో ఇసుక తోడేస్తూ రూ. కోట్లు కొల్లగొడుతున్నారు.
రోజూ వంద ట్రాక్టర్లలో..
అక్రమార్కులకు అన్నీతానై ఓ వ్యక్తి నేతృత్వం వహిస్తుండగా.. రోజుకు వంద ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తూ భారీగానే వెనుకేసుకుంటున్నారు. ఈపురుపాలెం, బోయినవారిపాలెం, తోటవారిపాలెం, జాతీయ రహదారిలోని అక్రమ తవ్వకాలతో రెచ్చిపోతున్నారు. శివారు కాలనీలు, ప్రధాన రోడ్డుపై వెళితే చాలు.. ఎక్కడ చూసినా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు కనిపిస్తూనే ఉన్నాయి. మైనింగ్, విజిలెన్స్, రెవెన్యూ, పోలీసు అధికారులు మాత్రం అసలు ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా పొక్లెయిన్లు పెట్టి తవ్వుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా ట్రాక్టర్లు, టైరుబండ్ల ద్వారా ఇతర ప్రాంతాలకు ఇసుక తరలిస్తున్నా అధికారులు కనీసం స్పందించడం లేదు. అక్రమ ఇసుక క్వారీల నుంచి ట్రాక్టర్ల ద్వారా ప్రధాన రోడ్ల మీదుగా తరలిస్తున్నారు. ఈ తతంగం అంతా చీరాల రూరల్ పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే జరుగుతున్నా.. ఒక్క ట్రాక్టర్ కూడా పట్టుకున్న దాఖలాలు లేవు. చీరాల పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఇందులో ఎక్కువ మందికి అధికార పార్టీ ముఖ్యనేత అండతో రెచ్చిపోతున్నారు. మరికొంత మందికి మాత్రం పలు శాఖల అధికారుల సహకారం అందిస్తున్నట్లు సమాచారం.
భారీగానే వసూళ్లు
గతంలో అర్ధరాత్రిళ్లు టైరుబండితో ఇసుకను తరలించే అక్రమార్కులు.. నేడు ఇరవై నాలుగు గంటలు ట్రాక్టర్లతో ఇసుకను సరఫరా చేస్తున్నారు. టైరు బండి ఇసుకను రూ.2 వేల వరకు, ట్రాక్టర్ లోడు ఇసుకను రూ.4 వేలకు విక్రయిస్తున్నారు. అనుమతులు లేకుండానే దర్జాగా ఇసుక దందాను కొనసాగిస్తున్నారు. చీరాల మండలంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈపురుపాలెం, బోయినవారిపాలెం, తోటవారిపాలెం, గవినివారిపాలెం, కావూరివారిపాలెం, విజయనగర్‌కాలనీ, పాతచీరాల, కొత్తపాలెం తదితర గ్రామాల్లో అధికార పార్టీ ముఖ్యనేత అండతో చోటా రాజకీయ నాయకులతోపాటు పలువురు ఇసుక అక్రమ వ్యాపారంలోకి దిగారు.
అక్రమ రవాణా అరికడతాం
చీరాల మండలంలోని గ్రామ పంచాయతీల్లో ఇసుక అక్రమ రవాణా, అనధికారంగా ఇసుక క్వారీల నిర్వహణపై మండల తహసీల్దార్ కుర్రా గోపీకృష్ణ వివరణ కోరగా.. గ్రామాల్లో అక్రమంగా ఇసుక అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించమన్నారు. గ్రామాల్లో రెవెన్యూ సిబ్బందితో తనిఖీలు చేయిస్తున్నామని చెప్పారు. ఈపురుపాలెం, బోయినవారిపాలెం, పాతచీరాల, తీర ప్రాంత గ్రామాల్లో అక్రమంగా ఇసుక క్వారీలు నిర్వహించినా, అమ్మకాలు చేసినా చట్టపరమైన కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు.


