
పింఛన్లు ఇవ్వకుండా ప్రభుత్వం మోసం
రీ వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగుల పింఛన్లు తొలగించడం దుర్మార్గం వైఎస్సార్‌సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు అగస్టీన్
నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్త పింఛన్లు ఇవ్వకపోగా... ఉన్న దివ్యాంగ పింఛన్లను రీ వెరిఫికేషన్ పేరుతో తొలగించడం దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్‌సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు బోక్క అగస్టీన్ పేర్కొన్నారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో దివ్యాంగ విభాగం ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి తర్వాత రాష్ట్ర ప్రజలను ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురిచేస్తోందన్నారు. ఎన్నికల హామీలో మాత్రం రూ.6 వేలు పింఛను ఇస్తామని చెబితే సంబరపడ్డామని.. ఇప్పుడు నిర్దయగా తీసేస్తున్నారని మండిపడ్డారు. గతంలో 80 శాతం వైకల్యం ఉంటే ఇప్పుడు 40 శాతం ఉన్నట్లు చూపించి పింఛన్లు తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హత కలిగిన వారికి కూడా మొండిచేయి చూపడం ఎంతవరకు సమంజసం అన్నారు. రీ వెరిఫికేషన్ పేరుతో ఆసుపత్రులకు, ఇతర కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీని వల్ల దివ్యాంగులు కార్యాలయాల మెట్లు ఎక్కలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.
నాడు అండగా వైఎస్ జగన్
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దివ్యాంగులకు అండగా నిలిచారు. 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను ఏర్పాటు చేసి తమ కష్టాలను తీర్చారని దివ్యాంగులు పేర్కొన్నారు. ఇప్పుడు వలంటీర్ వ్యవస్థ తీసేయడంతో ఏ పని కావాలన్నా కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. వారి కోసం సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులతో కలిసి నిరసన చేపడతామన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన విధంగానే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు దాసరి గణేష్‌బాబు, కొమ్మా లింగరావు, శంకర్, జె కృష్ణ తదితరులు పాల్గొన్నారు.