
ఉద్యాన పంటల సాగుతో రైతులకు మేలు
మాచవరం : ఉద్యాన పంటల సాగుతో రైతులకు మేలు జరుగుతుందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఐ. వెంకట్రావు తెలిపారు. మండలంలోని గంగిరెడ్డిపాలెం, పిన్నెల్లి, వేమవరం గ్రామాల్లో ఆయన పర్యటించారు. మిరప, జామ, డ్రాగన్ ఫ్రూట్ పంటలను పరిశీలించారు. రైతులందరూ పంట నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.మిరప, కూరగాయలు, ఆయిల్ పామ్ పంటల్లో తీసుకోవాల్సిన సస్యరక్షణ, యాజమాన్యం పద్ధతుల గురించి రైతులకు తెలియజేశారు. ఎండు తెగులు ఆశించిన జామ చెట్లకు 1గ్రా. కార్బెన్‌డజిమ్ లేదా 3గ్రా.కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటికి కలిపి చెట్టు మొదట్లో పోయాలని తెలిపారు. జింక్, మెగ్నీషియం ధాతు లోప నివారణకు 2గ్రా. జింక్ సల్ఫేట్, 2గ్రా. మెగ్నీషియం సల్ఫేట్, 10 గ్రా. యూరియా లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. అనంతరం పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో పిడుగురాళ్ల హార్టీకల్చర్ ఆఫీసర్ అంజలి బాయి, విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ కరుణ కుమారి, ప్రభాకర్ రెడ్డి, సాగర్ బాబు, గ్రామ రైతులు పాల్గొన్నారు.