
గంజాయి రవాణా కేసులో ముగ్గురి అరెస్ట్
మర్రిపాలెం (విశాఖ జిల్లా): ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన కారులో గంజాయిని గుర్తించిన పోలీసులు, ఆ కేసులో పరారీలో ఉన్న మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఐదవ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్ వెల్లడించారు. ఈ నెల 12న సుభాష్‌నగర్ వద్ద జరిగిన ప్రమాదంలో ఒక కారు ఢీకొని ఏడాదిన్నర చిన్నారి వర్షిత్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత కారు డ్రైవర్, తమిళనాడుకు చెందిన అర్జునన్ జెమినీ ఆర్ముగంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఉన్న మరో ముగ్గురు పరారయ్యారు. పోలీసులు ఈ నెల 16న సీజ్ చేసిన కారును తనిఖీ చేయగా.. 21 కిలోల గంజాయిని గుర్తించారు. పరారీలో ఉన్న ముగ్గురినీ అరెస్ట్ చేశారు. వారిని హైదరాబాద్‌లోని హాస్టల్‌లో ఉంటున్న గుంటూరుకు చెందిన అక్షయ గౌతమి(20), షేక్ మహమ్మద్ జాకీర్ (19), ఒంగోలుకు చెందిన పెర్లి విజయవర్ధన్ రాజు (25)గా గుర్తించినట్లు సీఐ తెలిపారు. వీరు విజయవాడలో కారు అద్దెకు తీసుకుని అరకు వెళ్లి గంజాయి కొనుగోలు చేశారు. తిరిగి వస్తుండగా ఊర్వశి జంక్షన్ సమీపంలోని సుభాష్‌నగర్ వద్ద ప్రమాదం జరిగింది. పెర్లి విజయవర్ధన్ రాజుపై ఇప్పటికే ఒంగోలులో 11 కేసులు ఉన్నాయని, మహమ్మద్ జాకీర్‌పై కూడా గంజాయి కేసు ఉందని పోలీసులు వెల్లడించారు. యువతికి తల్లిదండ్రులు లేరు. విజయవర్ధన్‌కు బంధువు కావడంతో అతనితో ఇలా వెళ్తూ ఉంటుందని పోలీసులు చెప్పారు. ఈ కేసులో ప్రతిభ చూపించిన ఎస్‌ఐలు షేక్ సమీర్, రవికుమార్‌లను సీఐ అభినందించారు.