
పొగాకు పంటకు ప్రత్యామ్నాయం అపరాలు
అద్దంకి: పొగాకుకు ప్రత్యామ్నాయంగా అపరాలు సాగు చేసుకోవాలని ఆత్మ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయనిర్మల సూచించారు. ‘ఆత్మ’ ప్రకాశం జిల్లా సౌజన్యంతో కొంగపాడులో వివిధ పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులపై గురువారం శిక్షణ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పొగాకుకు ప్రత్యామ్నాయంగా అపరాలు, మొక్కజొన్న, జొన్న పంటలు సాగు చేయాలని సూచించారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మురళీధర్ నాయక్ మాట్లాడుతూ మినుము, కంది, పెసర, శనగ పంటల సాగు, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, సస్యరక్షణ చర్యల గురించి వివరించారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ఎం.ఉష మాట్లాడుతూ అపరాల పంటలో విత్తనశుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలని.. రసం పీల్చే పురుగుల నివారణ కోసం విత్తన శుద్ధి చేయాలని సూచించారు. ఉప్పునీటి యాజమాన్యం శాస్త్రవేత్త కె. మృదుల మాట్లాడుతూ అపరాలు.. మొక్కజొన్నలో కలుపు నివారణ చర్యలు గురించి తెలియజేశారు. సహాయ వ్యవసాయ సంచాలకులు బి.ఎఫ్రాయిం మాట్లాడుతూ కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం బర్లీ పొగాకు సాగు చేయవద్దని సూచించారు. మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ మాట్లాడుతూ ప్రతి రైతు ఈ–పంట నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆత్మ బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ శేషారావు, అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్ రామిరెడ్డి, గ్రామ వ్యవసాయ సహాయకులు సాయిబాబు, వ్యవసాయ విస్తరణ అధికారి కోటేశ్వరరావు, మణికేశ్వరం సొసైటీ అధ్యక్షుడు నర్రా బ్రహ్మానందం, గుడిపూడి బ్రహ్మయ్య, పంచాయతీ కార్యదర్శి ప్రిస్కిల్ల, మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు.
ఆత్మ డిప్యూటీ డైరెక్టర్ విజయనిర్మల