
బీసీల రక్షణ కోసం చట్టం అవసరం
నరసరావుపేట: వెనకబడిన తరగతుల(బీసీ)పై రోజురోజుకూ దాడులు, వివక్ష, దౌర్జన్యం, సామాజిక బహిష్కరణకు గురవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రక్షణ చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని ఏపీ బీసీ సంక్షేమ సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్, జాతీయ ప్రధాన కార్యదర్శి కుమ్మర క్రాంతికుమార్ పేర్కొన్నారు. ట్రయాండ్ సిటీ హోటల్‌లో గురువారం నిర్వహించిన బీసీ సంక్షేమ సంఘం నాయకుల కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక చట్టం వల్ల బీసీలకు రక్షణతో పాటు వారిపై వివక్షను సమూలంగా అరికట్టగలదని నమ్మకం వ్యక్తం చేశారు. సంఘ రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను మాట్లాడుతూ ఎన్నికల వాగ్దానం మేరకు బీసీలకు రక్షణ చట్టం అమలు చేయాలని కోరారు. చట్టసభల్లో 33 శాతం, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పనుల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమం, అభ్యున్నతి కోసం నియమించిన అన్ని కమిషన్లు రాష్ట్రంలో 52 శాతంగా ఉన్న బీసీలు సామాజికం, ఆర్థికం, రాజకీయంగా వెనకబాటులో ఉన్నారని పేర్కొన్నాయని తెలిపారు. బీసీ నిరుద్యోగుల కోసం ఎస్సీ, ఎస్టీల మాదిరి బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ఉద్యోగుల ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ గురుకుల విద్యాలయాలు, స్టడీ సర్కిళ్లు, వసతి గృహాలను సకల సౌకర్యాలతో నిర్మించాలని కోరారు. ప్రభుత్వం పట్టించుకోని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొల్లిపర బాలాజీ, యువజన అధ్యక్షులు సుతారం విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.
ప్రభుత్వాన్ని కోరిన సంఘ నాయకులు